దీక్ష విరమించిన బీజేపీ నేత లక్ష్మణ్

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. నిమ్స్ లో దీక్ష చేస్తున్న ఆయనకు కేంద్రమంత్రి హన్స్ రాజ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ 5 రోజులుగా లక్ష్మణ్ చేస్తున్నారు. ఆహారం, పానీయాలు గానీ తీసుకోకుండా నిమ్స్ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న ఆయన నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బీపీ లెవల్స్, షుగర్ స్థాయి తగ్గిపోయినట్లు డాక్టర్లు తెలిపడంతో దీక్ష విరమించాలని ఆయన కుటుంబ సభ్యులు, కార్యకర్తలు కోరారు. అయితే అందుకు ఆయన అంగీకరించలేదు.
శుక్రవారం (మే3, 2019) నిమ్స్‌లో లక్ష్మణ్‌ను ఆ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి హన్స్ రాజ్ అహిర్ పరామర్శించారు. ఈక్రమంలో లక్ష్మణ్ చేత మంత్రి దీక్షను విరమింపజేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా లక్ష్మణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దీక్ష విరమించాలని ఆయన సైతం కోరడంతో లక్ష్మణ్ నిరాహార దీక్షను విరమించారు.
ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి హన్స్ రాజ్ అన్నారు. విద్యా శాఖ, ఇంటర్ బోర్డు కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. కేంద్రం నుంచి ఎలాంటి విచారణ, సహాయానికైనా సిద్ధమన్నారు.