కమిటీ హాల్‌లో సీఎల్పీ కసరత్తు

సీఎల్పీ నేత ఎంపిక కసరత్తు
రేస్‌లో భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్‌బాబు
టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం
నేతల అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ పరిశీలకుడు వేణుగోపాల్
హైదరాబాద్ : కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన 19 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఎవరు నాయకత్వం వహిస్తారో మరి కాసేపట్లో తేలనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. ఈ ప్రక్రియకు అధిష్ఠానం తరఫున పరిశీలకుడిగా నియమితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చి.. సీఎల్పీ భేటీ, సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియపై టీపీసీసీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని… ఏఐసీసీకి నివేదించారు. వాటి ఆధారంగా సీఎల్పీ నేతను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఇవాళే పూర్తవుతుందని,.. సాయంత్రానికల్లా సీఎల్పీ నేతను ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఉత్తమ్, డి.శ్రీధర్‌బాబు కూడా రేసులో ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరునూ పార్టీలోని కొన్ని వర్గాలు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.