తెలంగాణ బడ్జెట్ : అప్పులపై ఆందోళన వద్దన్న సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : September 15, 2019 / 08:18 AM IST
తెలంగాణ బడ్జెట్ : అప్పులపై ఆందోళన వద్దన్న సీఎం కేసీఆర్

Updated On : September 15, 2019 / 8:18 AM IST

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు సీఎం కేసీఆర్. అప్పులతో వచ్చే ఫలితాలు ఏడాదిలో కనిపిస్తాయన్నారు. రాష్ట్ర అప్పులు 21 శాతం ఉంటే..కేంద్ర అప్పులు 48 శాతం ఉన్నాయని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. 

బడ్జెట్ రూపకల్పనలో భేషజాలకు పోలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆపాలని కొందరు కుట్రలు చేసినా..సాధించామన్నారు. 21 శాతం వృద్ధి రేటు సాధించినట్లు చెప్పారు. కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే అప్పులు తీసుకొచ్చామని..సభలో వెల్లడించారు. రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రూ. 2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళుతున్నాయని వెల్లడించారు. 

ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అప్పు ఉన్న దేశం అమెరికా అని తెలిపారు. డిస్కంలకు రూ. 9 వేల కోట్ల అప్పులున్నాయని, ఇది గతం నుంచి కొనసాగుతోందన్నారు. రూ. 75 వేల కోట్ల అప్పు గత ప్రభుత్వాలు నెత్తిన పెట్టాయని సభలో వెల్లడించారు. కాంగ్రెస్ సభ్యులు సత్యదూరమైన విషయాలు చెప్పారని ఖండించారు. వారు ఇంకా 1940లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. తలతోక లేకుండా మాట్లాడుతుంటే బాధేస్తోందన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు రెండు పంటల్లో తీరిపోతుందని, తెలంగాణ రైతు అంచు ధోవతీ కట్టుకొనే రోజులొస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. మీరు ప్రాజెక్టులు కట్టి పచ్చగా చేస్తే..తమ ప్రభుత్వం ఎండగొట్టిందా అంటూ ప్రశ్నించారు.