15నిమిషాల్లోనే రిజల్ట్: ప్రభుత్వ దవాఖానాల్లో డెంగ్యూ కిట్‌లు

వైరల్ జ్వరాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బస్తీల్లో డెంగ్యూ, మలేరియా వంటి టెస్టులను నిర్వర్తించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టు కిట్‌ల సహాయంతో వైరల్ జ్వరాల ఫలితాలను కొద్ది నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. చాలా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు టెస్టు కిట్‌ల కొరత ఉంది. ఒకవేళ ఉన్నప్పటికీ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బస్తీ దవాఖానాల్లో టెస్టు కిట్‌లు అందుబాటులో ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు తొలగించనున్నారు అధికారులు. అంతేకాక, 15నిమిషాల్లో ఫలితాలు రావడం విష జ్వరం ఉందని తెలిస్తే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. ఈ టెస్టు కిట్‌లు 94శాతం కచ్చితమైన ఫలితాలు ఇస్తాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం విష జ్వరాలను ముందుగానే తెలుసుకుని జబ్బు ముదరకుండానే చికిత్స మొదలుపెట్టాలని, ప్రైవేట్ హాస్పిటల్స్ కు పరుగుతగ్గించాలనే.
ఈ ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈ పరీక్షల కోసం రూ.1500-2వేల వరకూ వసూలు చేస్తున్నారు. బస్తీ దవాఖానాల్లో ఈ వైద్య పరీక్షలు ఉచితంగానే లభిస్తుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ముందుగా ఈ పరీక్షల కోసం ఉదయం 10గంటల నుంచి 12గంటల సమయం వరకూ కేటాయించినా పెరుగుతున్న రద్దీ కారణంగా ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకూ ఉండేలా ఏర్పాటు చేశారు.
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రి కేటీ రామారావు ఆలోచన మేరకు హైదరాబాద్ నగరంలో మరో వారం రోజుల్లో 10 టెస్టు కేంద్రాలు పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు.