మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే డెల్లా గాడ్ఫ్రే మృతి

ఏపీ అసెంబ్లీ మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే డెల్లా గాడ్ఫ్రే (62) మరణించారు. ఆరు రోజుల నుంచి గుండె జబ్చుతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతూ మంగళవారం (ఏప్రిల్ 23, 2019) ఉదయం 6.30 గంటలకు మృతి చెందారు. డెల్ల గాడ్ఫ్రే రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నామినేట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.
ఆమె చాలా ప్రాచుర్యం గల వ్యక్తి. ఆంగ్లో-ఇండియన్ సమాజం కోసం మాత్రమే కాక అందరీ సంక్షేమం కోసం పోరాడారు. ఆమె తల్లి మార్జోరీ గాడ్ఫ్రే కూడా ఏపీ శాసనసభకు నామినేట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే ఎంపీగా కూడా ఎంపికయ్యారు.
డెల్లా గాడ్ఫ్రే హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. ఆమె రోసరీ కాన్వెంట్లో విద్యనభ్యసించారు. కోటిలోని ఓయూ కాలేజ్ ఫర్ విమెన్ నుండి పట్టభద్రురాలు అయ్యారు. ఆమె కేఎల్ ఎమ్ లో మేనేజర్ గా పనిచేశారు. డెల్లా గాడ్ఫ్రే మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆంగ్లో-ఇండియన్ సమాజానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేస్తూ, గాడ్ఫ్రే కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు నారాయణగూడలోని కాథలిక్ శ్మశానంలో జరుగనున్నాయి.