Sunitha Boya Arrest : నిర్మాత బన్నీవాసును బెదిరిస్తున్న యువతి అరెస్ట్

సినిమాల్లో అవకాశం కల్పిస్తానని తనను మోసం చేశాడంటూ ఆరోపిస్తూ.. గత కొంతకాలంగా నిర్మాత బన్నివాసుని బెదిరిస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Sunitha Boya Arrest : నిర్మాత బన్నీవాసును బెదిరిస్తున్న యువతి అరెస్ట్

Sunitha Boya

Updated On : July 14, 2021 / 3:24 PM IST

Film Producer Bunny Vasu And Sunitha Boya: కొంతమంది ప్రముఖులను బెదిరించటం..వారి నుంచి డబ్బులు తీసుకోవటం వంటివి కొంతమంది కేటుగాళ్లు చేస్తుంటారు. అదే సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులనైతే..సినిమాల్లో అవకాశాలు ఇస్తామనీ లేదా ఇప్పిస్తామని మోసం చేశారనే వార్తలు వింటుంటాం. వీటిలో ఫేక్ కూడా ఉంటాయి. ఈక్రమంలో తనకు తాను సినీ నటిగా చెప్పుకునే సునీత బోయ అనేయువతి..ఓ ప్రముఖ సినీ నిర్మాత తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని మోసం చేశాడని ఆరోపిస్తోంది. గతంలో నగరంలోని మలక్‌పేటలో పుచ్చకాయలు విక్రయిస్తుండేది. గతంలో ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధాలు ఉండేవి.

దీన్ని ఆసరాగా చేసుకొని సినీ నిర్మాత బన్నివాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని తనను మోసం చేశాడంటూ ఆరోపిస్తోంది. గత కొంతకాలంగా బన్నివాసుని బెదిరిస్తూ వేధిస్తోంది. దీంట్లో భాగంగానే కొన్నిసార్లు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లోని గీతా ఆర్ట్స్‌ ఆఫీసుకు వెళ్లి న్యూసెన్స్‌ చేయగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలా ఆమెపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసుల్లో జైలుకు కూడా వెళ్లింది సునీత. మరో రెండు కేసుల్లో మానసిక పరిస్థితి బాగా లేదని ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి పంపించి చికిత్స చేయించారు పోలీసులు.

ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక కూడా తిరిగి అదే పని. బన్నీవాసుకు ఫోన్లు చేసి పదే పదే విసిగిస్తోంది. బెదిరిస్తోంది. తనకు న్యాయం చేయకపోతే బన్నివాసు కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో తీసి పోస్ట్‌ చేసింది. దీంతో సునీతపై బన్నీవాసు మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆమె నిర్మాత కార్యాలయానికి వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా మానసిక స్థితి బాగాలేనందున ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాగా..ఉదయ శ్రీనివాస్ గవారా. ఇతనినే బన్నీ వాసు అని కూడా పిలుస్తారు. ప్రముఖ నిర్మాత, నటుడు అల్లు అరవింద్‌తో కలిసి స్థాపించిన నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్ పార్టనర్. భలే భలే మగడివోయ్, గీత గోవిందం,100% లవ్,సరైనోడు,నా పెరు సూర్య, నా ఇల్లు ఇండియా వంటి చిత్రాలకు సహ నిర్మాత.