గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు

  • Published By: madhu ,Published On : September 11, 2019 / 02:42 PM IST
గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు

Updated On : September 11, 2019 / 2:42 PM IST

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్‌లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంది. చివరి రోజు పూజలు అందుకుంటున్న మహాగణపతిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం ఖైరతాబాద్కు తరలి వచ్చారు. శోభాయాత్రను చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నట్లు అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్ 12వ తేదీ గురువారం ఉదయం 6గంటలకు శోభాయాత్ర ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే వినాయకుడిని తీసుకెళ్లే భారీ ట్రక్కు వినాయక మంటపానికి చేరుకుంది. వెల్డింగ్ వర్క్ కూడా ముగిసింది. మరోవైపు గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది పోలీసు యంత్రాంగం. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. వేల మందితో పహారా కాస్తూ… చిన్న అవాంఛనీయ ఘటన జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పటికే హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో నిమజ్జనానికి తెలంగాణ పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 21వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3లక్షల సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలను సిటీ కమీషనర్, డీజీపీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్స్ కు అనుసందానం చేశారు. దీనితో పాటు రూఫ్ టాప్ వాచ్ లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు. మూడు కమిషనరేట్లలోని సిబ్బంది అందరికీ సెలవులు రద్దు చేశారు.

స్టాండ్ టూ స్టేని ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను బట్టి ఏ ప్రాంతానికైనా  తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోని సిబ్బంది, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లు ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. వినాయక శోభయాత్రి కొనసాగే రూట్లలో ఉదయం 6 గంటల నుంచి ప్రైవేటు వాహనాలకు  అనుమతి ఉండదని, మొత్తం 30 గంటలపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్ తెలిపారు. శోభాయాత్ర జరిగే 17 ప్రధాన రహదారుల్లో పూర్తిగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ రూట్ మ్యాప్ ను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్  కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.