ఏం జరిగింది : జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావుకు సీరియస్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతడిని.. జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులు గోప్యంగా ఉంచారు. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గుండె నొప్పి అంటూ శ్రీనివాసరావు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే పరిశీలించిన జైలు డాక్టర్లు.. అతడ్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చేర్పించారు.
జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి చేశాడు శ్రీనివాసరావు. ఆ దాడిలో జగన్ భుజానికి గాయం అయ్యింది. స్పాట్ లోనే దాడి చేసిన శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్ధితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
విషయాన్ని జైలు అధికారులు, ఆస్పత్రి సిబ్బంది ధృవీకరించట్లేదు. అతని ఆరోగ్యం సాధారణ స్థితికి రాకుంటే.. కాకినాడకు తరలించి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లలో జైలు అధికారులు ఉన్నారు. జైలులోని శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురి కావటంపై పలు రకాలు చర్చలు మొదలయ్యాయి.