గడప దాటని పల్లెలు : లాక్ డౌన్ కు మద్దతు

  • Published By: chvmurthy ,Published On : March 24, 2020 / 03:36 AM IST
గడప దాటని పల్లెలు : లాక్ డౌన్ కు మద్దతు

Updated On : March 24, 2020 / 3:36 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ తో గ్రామాల్లోనూ జన జీవనం స్తంభించింది. గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.  కూలీ పనులకు సైతం వెళ్లకుండా ఇంటిలోనే ఉన్నారు. వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ  అత్యవసరాలు లేకపోవటంతో రైతులు పొలానికి వెళ్లలేదు.  గ్రామస్తులు ఊళ్ళోకివచ్చే రహాదారులను మూసి వేశారు.  

కొత్త వారు ఎవరూ గ్రామంలోకి రాకుండా అన్నివైపులా చెక్ పోస్టులు పెట్టి కాపలా కాశారు.  కొన్ని చోట్ల  పక్క గ్రామాల ప్రజలు  తమ గ్రామాల్లోంచి ప్రయాణించటానికి కూడా అభ్యంతరం చెప్పారు. సర్పంచ్‌, కార్యదర్శి అనుమతి లేనిదే గ్రామంలోకి కొత్త వారిని రానీయడంలేదు. మరోవైపు విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారిని గుర్తించిన పంచాయతీ సిబ్బంది.. వారిని ఇండ్ల నుంచి బయటకు రానీయకుండా చూస్తున్నారు.

ఆదివారం మొదలైన జనతా కర్ఫ్యూ తరహాలోనే గ్రామాల్లో కూడా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. గ్రామాల్లోకి అత్యవసరమైతే తప్ప వాహనాలను అనుమతించడం లేదు. 

పారిశుధ్ధ్య పనులపై శ్రధ్ధ
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు జోరందుకున్నాయి.  రోజుకు రెండు సార్లు….. ఉదయం, సాయంత్రం వీధులను పరిశుభ్రం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32వేల మంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో  నిమగ్నమై ఉన్నారు. పెద్ద గ్రామాలు, పట్టణాల్లో 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చారు.

బైక్‌లపై అనవసరంగా తిరిగే వారిని  పోలీసులు పట్టుకొని వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లు దాటి బయటకు రావద్దని ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే వారాంతపు సంతలు, మార్కెట్లు మూతపడ్డాయి. గ్రామంలోకి కొత్తవారు ఎవరు వచ్చినా వెంటనే సమాచారమివ్వాలని జిల్లా అధికారులు గ్రామ సచివాలయాలకు సమాచారమిచ్చారు.

గత పదిరోజుల వ్యవధిలో ఇతర రాష్ర్టాల నుంచి 3,546 మంది వచ్చినట్టు పంచాయతీ అధికారులు గుర్తించారు. దాదాపు 230 మంది విదేశాల నుంచి గ్రామాలకు వచ్చినట్టు తేలింది. వీరికి నిత్యం ఆరోగ్య పరీక్షలు జరుపుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. 

See Also | కరోనా వ్యాప్తి చేశారో చిప్పకూడే..కఠిన నిబంధనలు