తెలంగాణ ఉద్యోగులకు త్వరలో ప్యాకేజీ – మంత్రి హరీశ్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు, వేతన సవరణ, మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజీ కింద త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం శాసనమండలిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనమండలిలో ప్రకటించారు. బడ్జెట్‌పై సమాధానం ఇచ్చిన హరీశ్..ఉద్యోగులకు IR, PRCపై స్పందించారు. నిరుద్యోగుల భృతిపై మార్గదర్శకాల కోసం అధికారులను ఆదేశించడం జరిగిందని, నివేదిక అందగానే భృతి ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని సభ్యులు జీవన్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు తదితర సభ్యులు మండలిలో అంశాన్ని లేవనెత్తారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు అంశం సీఎం దృష్టిలో ఉందన్నారు మంత్రి హరీష్. త్వరలోనే ఒక ప్యాకేజీ రూపంలో సీఎం ప్రకటిస్తారని ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక.. 1, 44, 382 ఉద్యోగాలకు అనుమతినిచ్చిందని గుర్తు చేశారు. 1,17,714 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు.
రైతు రుణమాఫీ హామీ అమలుపై 15 రోజుల్లో నిబంధనలు వెల్లడిస్తామని సభకు తెలిపారు. రైతు రుణాలపై వడ్డీ రాయితీ అనేది నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వివరణనిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులకు లోబడి అప్పులు చేసి, ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడుతోందన్నారు. జీఎస్‌డీపీలో 21 శాతానికి లోబడి ఉన్నాయన్నారు. అప్పులు చేయడం నేరమన్నట్లు గ్లోబల్స్ ప్రచారం చేయకూడదని ప్రతిపక్షాలకు మంత్రి హరీష్ రావు సూచించారు.
ఇక శాసనమండలి బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 22కు వాయిదా పడ్డాయి. బడ్జెట్‌పై మండలి సభ్యులు ప్రస్తావించిన అంశాలు, ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానాలిచ్చారు. అనంతరం సభను ఈనెల 22కి వాయిదా వేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
Read More : తూర్పుగోదావరిలో బోటు మునక : 29 మంది తెలంగాణ వాసులు!