మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

  • Published By: chvmurthy ,Published On : March 12, 2019 / 04:48 AM IST
మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో జరిగే  శాసన మండలి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఐదు స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీచేస్తూ.. ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకి కేటాయించింది. మొత్తం ఐదింటినీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ స్కెచ్‌ వేసింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.  సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఉదయం గం.11-30 కి  సీఎం కేసీఆర్ తన ఓటు  హక్కను వినియోగించుకోనున్నారు.

ఎన్నికల పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రియాజ్(మజ్లీస్), సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.  కాగా ….  ఇవాళ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు  కాంగ్రెస్ పార్టీ  ప్రకటించింది. టీఆర్ఎస్ తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నా ఓటమి తప్పదనే కారణంతోనే చేతులెత్తేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.  ఎన్నికల్లో పాల్గొనట్లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రకటించారు. టీడీపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది.