తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు : ఎన్నికల కోడ్‌ పూర్తైన వెంటనే జారీ

  • Published By: veegamteam ,Published On : May 10, 2019 / 03:55 PM IST
తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు : ఎన్నికల కోడ్‌ పూర్తైన వెంటనే జారీ

Updated On : May 10, 2019 / 3:55 PM IST

అర్హులైన అందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీన ప్రక్రియను ప్రారంభించి.. జులై చివరికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు దీనికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టారు.

ఎన్నికల  కోడ్‌ పూర్తైన వెంటనే రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌ కార్డుల కోసం ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతోపాటు కొత్తగా అప్లికేషన్లు  స్వీకరించి.. అర్హులందరికీ కార్డులు ఇస్తారు. ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. రేషన్‌ కార్డుల జారీకి నలుగురు ఉన్నతాధికారులతో రెండు కమిటీలను నియమించింది. రేషన్‌ కార్డుల కోసం  హెచ్‌ఎండీతో పాటు జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. 

హెచ్‌ఎండీఏ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రేషన్‌ కార్డుల కోసం పెండింగ్‌లోఉన్న దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం అదనపు సిబ్బందిని నియమించింది. కొత్తగా అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. కుటుంబ సభ్యులందరి బయోమెట్రిక్‌ నమోదు చేస్తే.. రేషన్‌ కార్డుల జారీ సులభంగా ఉంటుందని ఉన్నతాధికారులు సూచించారు.   

పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డుల దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని  ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా చేసుకునే దరఖాస్తును పరిశీలించిన తర్వాత అర్హులైన అందరికీ రేషన్‌ కార్డులు జారీ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.