ఆపరేషన్ ఆకర్ష్ : బీజేపీలో రేవూరి, రవీంద్ర నాయక్

తెలంగాణలో టీడీపీ పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ క్రమక్రమంగా బలహీన పడుతున్న సంగతి తెలిసిందే. మెజార్టీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన సీనియర్ నేత రేవూరి బీజేపీలో చేరిపోయారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాషాయ కండువా కప్పుకున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో సెప్టెంబర్ 04వ తేదీ బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..అధికార టీఆర్ఎస్ పారటీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ..బీజేపీ శ్రేణులపై దాడులు చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. అవినీతి, కుటుంబ పాలన అంతమొందించేందుకు ప్రజాస్వామ్య, కలిసి వచ్చే శక్తులతో పోరాడుతామన్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. పార్టీ ఎదుగుతోందని..అందుకే పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణాలో బలపడేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నేతలతో టచ్‌లో ఉంటోంది. తెలంగాణలో 2024 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది. ఈ క్రమంలో తెలంగాణ పార్టీల నుంచి వచ్చే నేతలను కాదనకుండా కమల నాథులు కండువా కప్పేస్తున్నారు.
వరంగల్ అర్బన్ ప్రాంతానికి చెందిన రేవూరి టీడీపీలో కీలక నేతగా ఉంటూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలంటే నర్సంపేటలో టీడీపీ బలంగా ఉండేది. మహాకూటమి తరపున నర్సంపేట అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం విశ్వప్రయత్నాలు చేశారు. చివరి క్షణంలో మహాకూటమి పొత్తులో భాగంగా రేవూరికి వరంగల్ పశ్చిమ అభ్యర్థిత్వం దక్కింది. ఇక్కడ అనూహ్యంగా రేవూరి ఓటమి చెందారు. 1987 నుంచి టీడీపీలో ఆయన పనిచేశారు. రేవూరికి అత్యంత సన్నిహితంగా ఉండే..నేతలు టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే..ఆయన మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపడం గమనార్హం.