ఏముంటుందో : ఆర్టీసీ పరిస్థితిపై నివేదిక

  • Published By: madhu ,Published On : October 25, 2019 / 04:52 AM IST
ఏముంటుందో : ఆర్టీసీ పరిస్థితిపై నివేదిక

Updated On : October 25, 2019 / 4:52 AM IST

ఆర్టీసీ పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి అందనుంది. 2019, అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం ఆర్టీసీ ఈడీల కమిటీ ఈ నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది. గురువారం సుదీర్ఘంగా సమావేశమైన కమిటీ డీటైల్డ్‌ రిపోర్ట్‌ను రెడీ చేసింది. కార్మికులు కోరుతున్న డిమాండ్లు, వాటివల్ల సంస్థపై పడే భారం, తీర్చదగిన డిమాండ్ల వంటి వాటిపై స్పష్టమైన నివేదిక సిద్ధమైంది. 28న కోర్టుకు దీన్ని సమర్పించే అవకాశం ఉంది. 

ఆర్టీసీ సమ్మె 21వ రోజుకు చేరింది. ప్రభుత్వ ఆలోచన ఏంటన్నది సీఎం ప్రెస్‌మీట్‌ ద్వారా తేలిపోయింది. విలీనం ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. సమ్మె ముగియదు.. ఆర్టీసీనే ముగుస్తుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు యూనియన్ల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులు మంచోళ్లే అయినా యూనియన్‌ నేతలు వారిని మోసం చేస్తున్నారని, వారి పొట్టగొడుతున్నారని మండిపడ్డారు. 

ఇటు యూనియన్‌ నేతలు శుక్రవారం మరోసారి అఖిలపక్ష నేతలతో సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ తర్వాత పరిస్థితులపై వారు చర్చించనున్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను ఇప్పటికే యూనియన్‌ నేతలు ఖండించారు. ఇకముందు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్నది ఈ రోజు సమావేశంలో చర్చించనున్నారు. సమ్మెను మరింత ఉధృతం చేయడానికి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని యూనియన్‌ నేతలు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మెట్టుదిగే అవకాశాలు లేవని నిన్నటి సీఎం ప్రెస్‌మీట్‌తో స్పష్టమైపోవడంతో ఏం చేయాలన్నదానిపై యూనియన్లు మల్లగుల్లాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. 
Read More : కలిసి పోరాడుదాం : ఆర్టీసీ సమ్మె..ఎవరూ భయపడొద్దు – కార్మిక సంఘాలు