రేవంత్ రెడ్డి రాలేదు.. అందుకేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలను సరిచేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. దీనిలో భాగంగా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రచారంలో దూసుకెళ్తుంది.
ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో శనివారం శంషాబాద్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ సభకు అగ్రనేతలంతా హాజరైనా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన హైదరాబాద్‌లో ఉండి కూడా రాకపోవడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక హెలికాఫ్టర్ ఇచ్చి మరి ప్రచారానికి రేవంత్‌ను తిప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదని, పార్లమెంట్ సీట్ల ఎంపిక విషయంలో గుర్రుగా ఉన్న రేవంత్.. పార్టీలో తన మాట నెగ్గట్లేదనే భావనతో ఉన్నట్లు తెలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసినప్పటికీ అందుకు తగినంత ప్రాధాన్యత రేవంత్‌కు కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదని, అందుకే పార్టీ కార్యక్రమంకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండాలని, అయితే తనే అడిగితే కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా రకరకాల విమర్శలు వస్తాయని, అందువల్లే తననే కాంగ్రెస్ హైకామాండ్ అడగాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిలో ఆ పార్టీ పాత్ర కేంద్రంలో ఈసారి ప్రముఖంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో.. లోక్‌సభకు వెళ్లాలని ఏ కాంగ్రెస్ నాయకుడైనా అనుకుంటారు. అందుకే మహబూబ్‌నగర్‌తో పాటు మల్కాజిగిరి, ఖమ్మం నియోజకవర్గాలు కూడా.. రేవంత్ దృష్టిలో ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ప్రయత్నం చేయడం లేదు. రాహుల్ సభకు హాజరు కాకపోవడం ద్వారా.. తన ఉద్దేశాన్ని హైకమాండ్‌కు పంపాలని రేవంత్ అనుకుంటున్నారని… రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు టీఆర్ఎస్‌లో చేరతామని ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య రాహుల్ సభకు రాలేదు. అయితే రేవంత్ రెడ్డి పార్టీకి దూరం అవుతారనే విషయంపై స్పష్టత లేనప్పటికీ లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ఈ పరిణామం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.