సంక్రాంతి వడ్డన : పెరిగిన ప్లాట్ ఫాం టిక్కెట్ ధర

సంక్రాంతి పండుగ వచ్చేసింది. సికింద్రాబాద్ సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో రద్దీని నివారించడానికి ప్లాట్‌ఫారం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 20కి పెంచాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది.
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం నుంచి తెలుగు రాష్ర్టాలలోని ఆయా పట్టణాలు, నగరాలకు..గ్రామాలకు ఇతర రాష్ర్టాలకు లక్షలాది మంది ప్రయాణికులు బయలుదేరుతుండడంతో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.
ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రయాణికేతరులు రైల్వేస్టేషన్‌లలోకి రాకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంపు ఈరోజు నుంచే అంటే జనవరి 9 నుంచి 20వ తేదీ వరకు అమలులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మరోపక్క సంక్రాంతి పండుగ సీజన్ పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు టిక్కెట్ రేట్లు అమాంతంగా పెంచేశారు. బస్సు చార్జీలను భారీగా పెంచి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల నడుమ పండుగను సంతోషంగా చేసుకుందామన్న ఒకే ఒక్క ఆశతో ఎంత చార్జీ అయినా ప్రజలు భరించి బస్సులను ఆశ్రయిస్తున్నారు.
ఎంతఖర్చు అయినా సరే..ఊరు వెళ్లాల్సిందేననే ఆకాంక్షతో భారీగా డబ్బులు పెట్టి మరీ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇలా ఎవ్వరైనా సరే ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సంక్రాంతి వచ్చిదంటే చాలు ప్రజలపై భారాలు వేస్తున్నారు. ఆర్టీసీ బస్సు టిక్కెట్లు పెంచి రాష్ట్ర ప్రభుత్వాలు..ప్లాట్ ఫాం టిక్కెట్ ధరలు పెంచి ప్రజల జేబుల్ని దోచేస్తున్నారు.