ఆర్టీసీ సమ్మె ఆపేది లేదు : అశ్వత్థామరెడ్డి

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 12:04 PM IST
ఆర్టీసీ సమ్మె ఆపేది లేదు : అశ్వత్థామరెడ్డి

Updated On : October 15, 2019 / 12:04 PM IST

సమ్మె విరమించే ప్రసక్తే లేదని..యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ చర్చలకు పిలిస్తే వెళ్తామని చెప్పారు. అక్టోబర్ 18 వ తేదికి కేసు వాయిద పడిందని..ఆ లోపు పూర్తిస్థాయిలో చర్చించుకోవాలని ఇరు పక్షాలకు కోర్టు సూచించిందని తెలిపారు. ప్రభుత్వ తరపు లాయర్లను ప్రభుత్వంతో మాట్లాడాలని..యూనియన్ తరపు లాయర్లను కార్మిక సంఘాల నేతలతో మాట్లాడాలని 18న కోర్టుకు ముందుకు రావాలని సూచించినట్లు తెలిపారు.

సమ్మె విరమించమని హైకోర్టు చెప్పలేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి తెలిపిందని గుర్తు చేశారు. ప్రభుత్వం చర్చలు జరిపితే సమ్మె విరమణకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాలకు కోర్టు తెలిపిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలవకుండా కార్మికులు సమ్మె విరమించాలంటే అది జరిగే పని కాదన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరారు. 

ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుందని విమర్శించారు. కెకె కమిటీనే కాదు ఎలాంటి కమిటీలు కూడా తమతో చర్చలు జరపలేదన్నారు. కేసును అక్టోబర్ 18వ తేదిన కోర్టుకు హాజరవుతామని చెప్పారు. వాయిదా వేశారని.. అన్ని విషయాలు ఆ రోజున కోర్టుకు ముందుకు తీసుకురావాలని చెప్పారని తెలిపారు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడే కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో నివేదిక అందించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని తెలిపింది. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోర్టు సూచించింది. కార్మికులు సంయమనం పాటించాలని తెలిపింది.