తెలంగాణలో టీడీపీ కథ ముగిసినట్లేనా ? ఉనికి కోసం పాట్లు
తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవడం టీడీపీకి సవాల్‌గా మారింది.

తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవడం టీడీపీకి సవాల్‌గా మారింది.
హైదరాబాద్ : తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవడం టీడీపీకి సవాల్‌గా మారింది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ పార్టీ ఇపుడు ఉనికిని చాటుకునేందుకు పాట్లు పడుతోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు క్యాడర్.. లీడర్లతో బలంగా ఉన్న ఈ పార్టీ.. రాష్ట్ర విభజన తరువాత పరువు కాపాడుకునేందుకు పాకులాడుతోంది. లీడర్లే కాదు క్యాడర్ కూడా వలసపోవడంతో ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా జంకుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ… ఆశించిన ఫలితాలను దక్కించుకోలేకపోయింది. అయితే… పెద్దగా సీట్లు సాధించకలేపోయినా… అక్కడక్కడ ఓటు బ్యాంకు ఇంకా మిగిలే ఉందని మాత్రం స్పష్టమైంది. ఇలాంటి తరుణంలో మరో ఐదేళ్ల విజన్ తో పార్టీని ముందుకు నడపాల్సిన అవసరం ఉంది. కానీ… ఆ పార్టీలో ఇప్పుడు పేరున్న లీడర్లే లేని పరిస్థితి. ఉన్నవారైనా పోటీకి దిగి ఉనికిని నిలబెట్టుకుంటారా అంటే… అదీ కనిపించని దుస్థితి.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికి గులాబీ గూటికి చేరతానని ప్రకటించగా.. మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే… కాంగ్రెస్‌తో పొత్తే తమ కొంప ముంచిదని భావిస్తున్న తెలుగుతమ్ముళ్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన వారు, టికెట్ అశించి భంగపడిన వారు పార్లమెంట్ బరిలో నిలవాలని కలలుగన్నారు. కానీ… తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయట్లేదని ప్రకటించి వారి కలలను కల్లలు చేశారు ఆ పార్టీ అధినేత.
ఇది కార్యకర్తలపై, క్యాడర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నాయి టీడీపీ శ్రేణులు. కారణాలు ఏవైనా… పార్టీకి నాయకులు కరవైన ఈ సమయంలో ఎన్నికల బరినుంచి తప్పుకోవడం సానుకూల నిర్ణయం కాదంటున్నారు. ఈ నిర్ణయం తాత్కాలిక అవసరమే అయినా… దీర్ఘకాలంలో పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేస్తుందని అంటున్నారు.