తేలుతుందా : ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. కోర్టులో దీనిపై వాదనలు జరుగుతున్నాయి. నవంబర్ 01వ తేదీన మరోసారి కోర్టులో ప్రభుత్వం, కార్మికుల పక్షాన న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు..నవంబర్ 02వ తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్..ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
నవంబర్ 01వ తేదీ శుక్రవారం ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమాశానికి మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మ సమర్పించిన నివేదికపై ఉన్నతన్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 07వ తేదీకి విచారణ వాయిదా వేసింది కోర్టు. విచారణలో కోర్టు లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. శనివారం కేబినెట్ సమావేశం జరుగనుండడం..ఈ సమయంలో ఆర్టీసీపై కేసీఆర్ చర్చిస్తుండడం ప్రాధాన్యత ఏర్పడింది. కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్..ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ఆర్టీసీ సమ్మె 28వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాటు సరిపోవడం లేదు. దీంతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలకు బస్సులు రాక..సమస్యలు ఎదుర్కొంటున్నామని శివారు ప్రాంత వాసులంటున్నారు. వచ్చే బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో సమస్య అధికమౌతోంది. బస్సులు అస్సలు రావడం లేదని..దీంతో ఆటోలు, ఇతర ప్రత్యామ్యాయ మార్గాలను చూసుకోవడం ద్వారా జేబుకు చిల్లు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి..కేబినెట్ భేటీలో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.
Read More : డ్రైవర్ బాబు కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం హామీలు