మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ : ఉధృతమౌతున్న ఆర్టీసీ సమ్మె

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల్లేవని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని కుండబద్దలు కొట్టింది సర్కార్. తాము కూడా వెనక్కి తగ్గేదే లేదని.. తాడోపేడో తేల్చుకుంటామని ఆర్టీసీ కార్మికసంఘాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తిగా సమ్మెను ఉద్యమంగా మలుస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. అక్టోబర్ 13వ తేదీ ఆదివారానికి సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈనెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో సర్కార్ మరో అడుగు ముందుకు వేసి ఈనెల 19 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
ప్రభుత్వం పట్టువీడనంటుంది. కార్మికసంఘాలు వెనక్కి తగ్గనుంటున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు కార్మికసంఘాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అన్నింటికీ సిద్ధపడే పోరుబాట పట్టామని కార్మికసంఘాలు అంటుంటే ఎన్నిరోజులు సమ్మె చేస్తారో చేయండంటూ సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం డిపోల ముందు వంటా వార్పు చేపట్టాయి కార్మికసంఘాలు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో డిపోల ముందు బైఠాయింపు, ధర్నాలు నిర్వహించనుంది.
ఈనెల 15న రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారులపై రాస్తారోకో నిర్వహించనుంది. 16న అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక 17న అన్ని డిపోల ముందు ‘ధూం ధాం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. 18న బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ ఆందోళనల్లో కార్మికులతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు. అటు ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతితో కార్మికులు శోకసంద్రంలో మునిగిపోయారు. కార్మికులెవరూ ప్రాణత్యాగాలు చేయొద్దని కొట్లాడి డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు.
Read More : ఖమ్మంలో విషాదం : ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ మృతి