తెలంగాణకు భారీ వర్ష సూచన

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆగస్టు 23వ తేదీ శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వచ్చే 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు నగరంలో భారీ వర్షం కురిసింది. ఆగస్టు 22వ తేదీ గురువారం రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఐటీకార్ డార్‌లో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దీంతో వాహనదారులు ప్రత్యక్ష నరకం అనుభవించారు. బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఈసీఎల్, అల్వాల్, కూకట్ పల్లి, తిరుమలగిరి, నేరెడ్ మెట్, ఖైరతాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.