సారు..కారు…పదహారు..ఢిల్లీలో సర్కార్ : కేటీఆర్

హైదరాబాద్ : కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ గెలవాలన్నారు. సారు..కారు…పదహారు..ఢిల్లీలో సర్కార్ నినాదంతో ముందుకెళ్దామని చెప్పారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో గులాబీ జెండా ఎగురవేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఢంకా బజాయించి.. తెలంగాణలోని 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలన్నారు. గోల్కొండ ఖిల్లాపై కేసీఆర్ టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తుంటే.. రేపు ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగిరేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఏప్రిల్ 11 న జరిగే లోక్ సభ ఎన్నికలకు ప్రచారాన్ని గట్టిగా చేయాలని పిలుపు ఇచ్చారు. ఉత్తరభారతంలో కరెంట్, రోడ్లు, మంచినీరు లేని చాలా గ్రామాలు, పట్టణాలు ఉన్నాయన్నారు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు అధికారం ఇచ్చారని..కానీ ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ప్రజలకు ఏమీ చేయలేకపోయిన ఆ రెండు పార్టీలు మళ్లీ ఏ ముఖంతో ఓట్లు అడుగుతున్నాయని నిలదీశారు. దేశంలో ఏం పరిస్థితి ఉందో ఆలోచన చేయాలన్నారు.
టీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటా తప్పా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. 2014లో నరేంద్రమోడీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు దేశం మొత్తం ఆయన హవా ఉండేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ మూడు సార్లు గెలిచారు…ఏదో గొప్ప పని చేస్తాడు.. దేశాన్ని కూడా అదే పద్ధతిలో ఉద్దరిస్తాడాని ప్రచారం జరిగితే.. దేశంలోని యువతతోపాటు అందరూ ఏకపక్షంగా బీజేపీకి 283 సీట్లు ఇచ్చారని.. దేశాన్ని మీరే నడపండని మోడీ చేతిలో పెట్టారని పేర్కొన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా.. ఐదు సంవత్సరాల్లో మొత్తం 10 కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పారని.. దేశంలో పది కోట్ల ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు.
పెద్ద నోట్లను రద్దు చేసి రైతులు, చిన్న చిన్న వ్యాపారులను బ్యాంకుల ముందు నిలబెడితే..ఆ క్యూలో కూడా గుండె పగిలి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పారని.. ఒక్కొక్క పేదవాడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పారని… దేశంలో ఒక్క పేదవాడి అకౌంట్ లోకైనా 15 లక్షల రూపాయలు వచ్చాయా? అని ప్రశ్నించారు. సబ్ కా సాత్..సబ్ కా వికాస్ అన్నారని..కానీ తెలంగాణకు మాత్రం హాతే ఇచ్చాడని ఎద్దేవా చేశారు.
ఏపీలోని పోలవరానికి ప్రధాని మోడీ జాతీయ హోదా ఇచ్చారని… ఆంధ్రాకు ఏమిచ్చినా సంతోషిస్తామని చెప్పారు. కానీ తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. పోలవరంకు జాతీయ హోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏదైనా ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని మోడీని అడిగామని .. కానీ తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక.. ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి.. దాని స్థానంలో నీతి ఆయోగ్ అనే సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. నీతి ఆయోగ్..భారతదేశానికి దిశానిర్ధేశం చేస్తుందని చెప్పారని పేర్కొన్నారు కేటీఆర్. దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించారని.. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేదన్నారు.
దేశంలో మోడీ హవా లేదన్నారు. మోడీ కంటే రాహుల్ గాంధీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందన్నారు. రాహుల్ కు వంద సీట్లకు మించి వచ్చేటట్లు లేవన్నారు. నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ కలిసి కూడా పోటీ చేస్తే 273 సీట్లు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఒక్కొక్క ఎంపీ రేపటి నాడు ఢిల్లీలో కీలకం కాబోతున్నారని చెప్పారు. ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని కొనియాడారు. 16 మంది ఎంపీలతో ఢిల్లీ మెడలు వంచి.. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రానికి లక్షా 50 వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రైతుల కన్నీళ్లు తూడ్చటానికి తెలిపారు. పంటలకు శరవేగంగా నీళ్లవడానికి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు. రూ.80 వేల కోట్లతో గోదావరిపై కాళేశ్వరం, రూ.40 వేల కోట్లతో కృష్ణా నదిపై పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతున్నామని చెప్పారు. పక్క రాష్ట్రమైన ఏపీలో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు.. దానికి కేంద్రం జాతీయ హోదా కల్పించిందన్నారు.