ఏ రాష్ట్రంపైనా వివక్షలేదు: ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకే తెలంగాణకు నిధులు

  • Published By: chvmurthy ,Published On : February 16, 2020 / 12:48 PM IST
ఏ రాష్ట్రంపైనా వివక్షలేదు: ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకే తెలంగాణకు నిధులు

Updated On : February 16, 2020 / 12:48 PM IST

15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించామని… ఏ ఒక్క రాష్ట్రాన్ని తగ్గించి‌ చూడాలన్నది మా ఉద్దేశం కాదన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఆమె ఆదివారం  హైదరాబాద్ లోని  ట్రైడెంట్ లో బడ్జెట్ పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘ బడ్జెట్ ప్రవేశపెట్టిన‌ తర్వాత ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరుతో పాటు అన్ని నగరాల్లో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల్ని కలవడం మొదలుపెట్టాం.  తెలంగాణ నుంచి కేంద్రానికి మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. సెస్ కలెక్షన్ తక్కువ కావడం వల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులు ఇవ్వలేకపోయము. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు. త్వరలోనే ఈ నిధులు ఇస్తాం. సెస్ వచ్చే కొద్దీ ఇస్తూనే ఉంటామని’ ఆమె  తెలిపారు. 

రాష్ట్రాలకు ఇచ్చే 42 శాతం వాటాను ఆర్థిక శాఖ తగ్గించ లేదని,  ఒక్క సంవత్సరానికి మాత్రమే ఆర్థిక సంఘం రిపోర్ట్‌ ఇచ్చిందని ఆమె వివరించారు. 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడటం వల్ల.. ఆర్థిక సంఘమే ఒక శాతం వాటాను తగ్గించిందని స్పష్టం చేశారు. తెలంగాణలో పన్నువసూళ్లు చాలా బాగున్నాయని  ఆమె కితాబిచ్చారు. 

15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించాం. ఏ ఒక్క రాష్ట్రాన్ని తగ్గించి‌ చూడాలన్నది మా ఉద్దేశం కాదు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం.. మోదీ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఎక్కడా తాము దాటలేదని నిర్మల గుర్తు చేశారు. ఆర్థిక క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకున్నామని, వాజ్‌పేయి, మోదీ నేతృత్వంలో వచ్చిన బడ్జెట్లలో ఇది కచ్చితంగా కనిపిస్తుందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లానే తెలంగాణతో కూడా కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు తగ్గించాలా, పెంచాలా అనేది రాష్ట్రాల పనితీరుపై ఆధారపడి‌ ఉంటుందని తెలిపారు. 

జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను సరిగా ఇవ్వలేకపోయామని…అనుకున్న స్థాయిలో జీఎస్టీ వసూలు కాకపోవడమే దీనికి కారణం అని ఆమె వివరించారు. డిసెంబర్ లో జీఎస్టీ  మీటింగ్ కు ముందు రెండు నెలల వాటాను ఇచ్చాము. ఇప్పటి వరకు ఇవ్వాల్సిన వాటాలను ఖచ్చితంగా రెండు విడతల్లో అందిస్తామని చెప్పారు. ఇది‌ ఇప్పుడు చెప్పడం కాదు జీఎస్టీ కౌన్సిల్ లోనే చెప్పాము. 

ఈసారి 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువయ్యాయి కాబట్టే 42 నుంచి ఒక శాతం తగ్గించి 41 శాతం నిధులు కేటాయించాము. అదనంగా ఒక శాతాన్ని యూటీ లకు కేటాయించాము. కేంద్రం నుంచి వచ్చే ఎలాంటి నిధులను మేం తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం లేదు అనేది సరికాదు. తెలంగాణకి 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న మాట అవాస్తవం.