న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం : 30 మూగ జీవాలు సజీవ దహనం

నూతన సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజునే జర్మనీలోని ఒక జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోతులతో సహా పక్షులు 30కిపైగా జంతువులు సజీవ దహనమయ్యాయి. 2020 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆకాశంలోకి వదిలిన స్కై లాంతర్ల వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో చిక్కుకున్న రెండు చింపాంజీలను మాత్రం అగ్నిమాపక సిబ్బంది రక్షించగలిగారు. చనిపోయిన వాటిలో చాలా జంతువులు అంతరించిపోతున్న జాతులకు చెందినవని జూ డైరెక్టర్ ఆవేదన వ్యక్తంచేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జర్మనీలో సాధారణంగా పటాకులు కాల్చుతారు. కానీ స్కై లాంతర్లు అక్కడ చట్టవిరుద్ధం.
కొంతమంది అత్యుత్సాహంతో స్కై లాంతర్లు వదలటంతో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. క్రెఫెల్డ్ జూ సమీపంలో స్కై లాంతర్లు వదలటం చూశామని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. స్కై లాంతర్ల వల్లనే జూలో ప్రమాదం సంభవించిందని పోలీస్ అధికారి గెర్డ్ హాస్మన్ తెలిపారు.