అమెరికాలో తెలుగువారంతా సురక్షితమే.. ఎవరికి కరోనా సోకలేదు : తానా అధ్యక్షుడు జయ్ తాళ్లూరి

కరోనా మహమ్మారితో అమెరికా అల్లాడిపోతోంది. న్యూయార్క్‌లో మాత్రం కరోనా వ్యాప్తి ఎక్కువగా విస్తరిస్తోంది. ప్రతి మూడు రోజులకు కరోనా పాజిటివ్ కేసులు డబుల్ అవుతున్నాయి. న్యూయార్క్‌లో మూడోవంతు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తే కరోనా వస్తుందేమోనని భయపడి పోతున్నారు. అమెరికాలో డాక్టర్ అపాయింట్ మెంట్ దొరకడం కూడా కష్టంగా ఉంది.
అమెరికాలో వాస్తవ పరిస్థితి ఏంటి? అమెరికాలో తెలుగువారు సేఫేనా? కరోనా కట్టడికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ఉత్తర అమెరికా ‘తానా’ సంఘం అధ్యక్షుడు తాళ్లూరి జయ్ తాళ్లూరి ఎక్సూక్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగువారిలో విద్యార్థులకు కొవిడ్ లక్షణాలపై అవగాహన కల్పిస్తున్నామని తాళ్లూరి జయ్ తెలిపారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే.. వారికి సాయం చేసేందుకు హెల్ప్ లైన్ నెంబర్లు ఇవ్వడం జరిగిందన్నారు.
తాము ఫుడ్ డొనేట్ చేయడంతో పాటు మాస్క్‌లను సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. మిగతా విషయాల్లో పెద్దగా భయపడాల్సిన పనిలేదని, అందరూ జాగ్రత్తగానే ఉన్నారని తెలిపారు. అమెరికాలో తెలుగువారంతా సురక్షితంగానే ఉన్నారన్నారు. ఎవరికి కరోనా సోకినట్టు ఎలాంటి రిపోర్టులు లేవని తెలిపారు. తెలుగువారు ఎవరూ కరోనా వైరస్ తో మరణించలేదని స్పష్టం చేశారు. అందరూ ధైర్యంగా ఉండొచ్చునని, తెలుగువాళ్లంతా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తాళ్లూరి చెప్పారు.
ఇప్పటివరకు అమెరికాలో 3లక్షల 11వేల 625 కరోనా కేసులు నమోదుకాగా 8వేల 454మంది మరణించారు. అత్యధికంగా న్యూయార్క్ లో 1లక్షా 14వేల 775 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో 34వేల 124 కేసులు నమోదయ్యాయి. మిచిగాన్ లో 14వేల 225 కేసులు నమోదయ్యాయి. ఇక కాలిఫోర్నియాలో కూడా 13వేల 927 కేసులు నమోదయ్యాయి. ఫ్లోరిడాలో కూడా 11వేల 545 కేసులు నమోదయ్యాయి.
కరోనా మరణాల విషయంలో న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంది. ఒక్క న్యూయార్క్ లోనే ఇప్పటివరకు 3వేల 565 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో అత్యధికంగా 846 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలోనే కరోనా మరణాలు 24గంట్లలో అత్యధికంగా అమెరికాలోనే నమోదయ్యాయి.
శనివారం ఒక్కరోజే అమెరికాలో 1,331 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో 630 మంది మృతిచెందారంటే ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చనిపోయినట్లు లెక్క. అమెరికాలో 1,408కరోనా మరణాలు నమోదయ్యాయి.