ఒక్క ఉల్లిగడ్డ రూ.65..!! : కొనగలరా? తినగలరా?..

ఒక్క ఉల్లిగడ్డ 65 రూపాయలు. అంటే నోరెళ్లబెడతాం. ఉల్లి కోసినప్పుడు కంట్లోంచి వచ్చేనీళ్లు..కొనేటప్పుడు వస్తున్నాయి అనుకోవటం ఇటీవల కామన్ గా మారిపోయింది. కానీ ఈ ఉల్లిగడ్డ రేటు వింటేనే కన్నీళ్లొచ్చేలా ఉంది కదూ. ఒక్క ఉల్లిగడ్డ రూ.65..!!లు అంటే ఇదేదో మరీ విడ్డూరం అనుకోవద్దు. నిజమే. ఛత్తీస్ గఢ్ లో కిలోకి రెండు మూడు ఉల్లిపాయలే తూగుతున్నాయి. ఇది వ్యాపారుల మోసం అనికూడా అనుకోవద్దు. ఆ ఉల్లిగడ్డల సైజు అలా ఉంది.
ఛత్తీస్ గఢ్ లోని ఉల్లి వ్యాపారులు ఇస్తాంబుల్(టర్కీ)నుంచి 60 టన్నుల ఉల్లిపాయల్ని దిగుమతి చేసుకున్నారు. ఈ ఉల్లిపాయలు మామూలు ఉల్లిపాయల కంటే భారీ సైజులో ఉన్నాయి. ఎంత అంటే కిలోకి రెండు మూడు ఉల్లిగడ్డలే తూగేంత. వీటిని కిలో రూ. 120 నుంచి రూ. 130లు అమ్ముతున్నారు.
ఒక్కో ఉల్లిపాయ బరువు 350 నుంచి 600 గ్రాములుగా ఉంటోంది. అంటే కిలోకి రెండు తూగే ఉల్లిపాయల లెక్కన చూస్తే ఒక్కో ఉల్లిగడ్డ రూ. 65 లు పడింది. కిలోకి మూడు తూగితే ఒక్కో ఉల్లిగడ్డ రూ. 43లు పడుతోంది. దీంతో ఉల్లి అందుబాటులోకి వచ్చినా ధరలు మాత్రం ఆకాశంలో చుక్కలు కనిపించేలా ఉన్నాయి వాపోతున్నారు.
రేట్లు ఇలా ఉంటే ఏం కొంటాం..ఏం తింటాం అని అనిపిస్తోంది కదూ. కానీ తిట్టుకుంటూనే తినక మానటం లేదు ప్రజలు. ఇలా ఇంకెన్ని రూపాలు ఉల్లిపాయలు కొనటానికి తగలెయ్యాలో అర్థం కాకుండా ఉంది ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ఏమో అనుకుంటున్నారు ప్రజలు.