గత 40 ఏళ్లలో అమెరికా అతిపెద్ద విదేశీ విధాన వైఫల్యం చైనా, ట్రంప్

  • Published By: naveen ,Published On : September 6, 2020 / 11:24 AM IST
గత 40 ఏళ్లలో అమెరికా అతిపెద్ద విదేశీ విధాన వైఫల్యం చైనా, ట్రంప్

Updated On : September 6, 2020 / 11:57 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాపై తన అక్కసు వెళ్లగక్కారు. గత 40 ఏళ్లలో అమెరికా అతి పెద్ద విదేశీ విధాన వైఫల్యం చైనా అని చెప్పారు. చైనాను డీల్ చేసిన తీరు పట్ల ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోసపూరిత పద్ధతిలో చైనా ధనిక దేశంగా మారిందని ఆరోపించారు. మోసపూరిత వాణిజ్య విధానం, పొరుగు దేశాలను భయపెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన చైనీయుల గళాన్ని అణిచివేయడం(తియాన్ మెన్ స్వ్కేర్) లాంటి పద్దతులతో చైనా పైకి ఎదిగిందని అమెరికా అంది.

ప్రపంచంలోని దేశాలన్నీ వెస్ట్రన్ కావాలని, ప్రజాస్వామ్యం వెల్లివిరియాలని మేము కోరుకున్నాం. అందుకు భిన్నంగా చైనాలో జరుగుతోంది. చైనాలో మానవ హక్కులను కాలరాస్తున్నారు. అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చైనాలో ప్రజలు మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. ఇలా అన్ని విధాలుగా చైనాలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు అని అమెరికా అభిప్రాయపడింది.

ఏది ఏమైనా ట్రంప్ నేతృత్వంలోని అమెరికా చైనాకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ ఒబ్రెయిన్ చెప్పారు. చైనాకు వ్యతిరేకంగా నిలిచిన తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని చెప్పారు.

ఇప్పటికే అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాన్స్ చిక్కితే చాలు చైనాపై కత్తులు నూరుతున్నారు. అవసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా జాగ్రత్త పడతామని స్పష్టం చేశారు. కాగా, అమెరికా ఉత్పత్తులకు చైనా అతిపెద్ద దిగుమతిదారు అన్న సంగతి తెలిసిందే. ‘చైనాతో వ్యాపారం చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము సరైన భాగస్వామి అని చైనా అనుకోవడం లేదు. అందుకే మేమూ అలానే ఆలోచిస్తున్నాం’ అని ట్రంప్‌ చెప్పారు. కాగా, జనవవరిలో మొదటి దశ వాణిజ్య ఒప్పందాల సమయంలో ట్రంప్‌ చైనాతో ట్రేడ్‌ వార్‌కు తెర తీశారు.

చైనా నుంచి దిగుమతులపై టారిఫ్‌లు పెంచడంతో షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం కూడా దీటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండగానే కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా అమెరికా తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు విముఖత చూపారు. ఇదిలా ఉండగా.. చైనాలో అమెరికా తయారీ సంస్థలకు న్యాయమైన, స్థాయి ప్రాతిపదికన పోటీకి అవకాశాలు లభించకపోతే.. యూఎస్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు వేరుపడక తప్పదని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్‌ మునుచిన్‌ జూన్‌లో చెప్పడం గమనార్హం.

చైనాతో ట్రేడ్ వార్ తో పాటు చైనా కంపెనీలకు వరుస షాక్‌లిస్తున్నారు ట్రంప్‌. ఆ దేశ కంపెనీలను బ్యాన్ చేస్తున్నారు. లేదా బ్లాక్ లిస్టులో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. చైనా కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని అమెరికా పేర్కొంది. అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో ఏడు టెక్నాలజీ కంపెనీలు కాగా, మిగతా వాటిలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్నాయంటూ 24 చైనా కంపెనీలను గత నెలలో అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. చైనా మిలటరీతో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నాయని, మైనార్టీల ప్రయోజనాలను ఇవి కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే.