కరోనా రాకాసి : ఇటలీలో 2500 మంది మృతి

  • Published By: madhu ,Published On : March 18, 2020 / 01:25 AM IST
కరోనా రాకాసి : ఇటలీలో 2500 మంది మృతి

Updated On : March 18, 2020 / 1:25 AM IST

కరోనా రాకాసి ఇటలీని వణికిస్తోంది. ఈ దేశంలో ఇప్పటి వరకు కరోనాతో… 2500లకుపైగా ప్రజలు ప్రాణాలు వదిలారు. 2020, మార్చి 17వ తేదీ మంగళవారం ఒక్క రోజే 345 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇటలీలో ఇప్పటి వరకు 31,510 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 3వేల 530 కేసులు నమోదవ్వడం ఇటలీని భయాందోళనకు గురిచేస్తోంది. చైనా తర్వాత అత్యంత ఎక్కువ కేసులు, ఎక్కువ మరణాలు కూడా ఇటలీలోనే జరుగుతున్నాయి.

గత నాలుగైదు రోజులుగా ఇటలీలో మరణాల సంఖ్య మరింత పెరిగింది. ప్రతి రోజూ మూడు వందలకు పైగానే మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ఇటలీ ప్రజలు వణికిపోతున్నారు. జాగ్రత్త చర్యలు పాటిస్తున్నా.. కరోనా రాకాసి దేశంలోని అన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందులో వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు విడుస్తున్నారు.

ఇదే కంటిన్యూ అయితే కోవిడ్‌ మరణాల్లో చైనాను మరికొన్ని రోజుల్లోనే మించిపోనుంది. జనవరి 29న రెండు కేసులు వెలుగు చూశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మరుసటి రోజే  ఆరు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. చైనా నుంచి విమానాల రాకను నిషేధించారు. కానీ 20 రోజుల్లోనే పరిస్థితి తలకిందులైంది. ఇంత వేగంగా వైరస్‌ వ్యాప్తి చెందడానికి అక్కడి వైద్యులు, ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జనవరి నెల మధ్య నుంచే ఈ వైరస్‌ నెమ్మదిగా ఇటలీలోకి పాదం మోపడం మొదలైంది. ఆ తర్వాత చాపకింద నీరులా విస్తరించింది. అయినా వైద్యులు కోవిడ్‌ కేసులను గుర్తించడంలో విఫలమయ్యారు. దగ్గు,జలుబు, జ్వరంతో బాదపడుతూ వచ్చిన రోగులకు సాధారణ వైద్యం చేసి ఇంటికి పంపారు. దీంతో వైరస్‌ మహమ్మారి దేశం మొత్తం వేగంగా విస్తరించింది. 
ఖరీదైన లెదర్‌ బ్యాగులు, షూలు, ఇతర ఉత్పత్తులకు ఇటలీ ప్రసిద్ధి.

గూచి, లూయీ వ్యుటాన్‌, బెలెన్‌సియాగా లాంటి పేరెన్నికగన్న బ్రాండ్లు ఇక్కడ్నుంచి తయారవుతాయి. మిలన్‌ పరిసరాల్లోని ఈ పరిశ్రమల్ని ఎక్కువగా చైనా వ్యాపారవేత్తలు నిర్వహిస్తున్నారు. మిలన్‌-వుహాన్‌ల మధ్య నేరుగా పలు విమాన సర్వీసులు నడుస్తాయి. తోళ్ల పరిశ్రమల్లో పనిచేయడానికి చైనాలోని వుహాన్‌ నుంచి కార్మికుల్ని తీసుకువస్తారని, ఇలా వచ్చిన వారి నుంచి కూడా కోవిడ్‌ వ్యాపించింది.  ఏదైతేనేం ప్రమాదాన్ని ముందే పసిగట్టకపోవడంతో ఇటలీ ఇప్పుడు కోవిడ్ రాకాసి భూతానికి బలవుతోంది. దేశ పౌరుల ప్రాణాలను కోల్పోతోంది. 

Read More : జవాన్‌కు సోకిన కరోనా వైరస్..@142 కేసులు