ట్రంప్ అన్నంత పనిచేస్తారా? దేశాధ్యక్షుడికి మిలటరీని దింపే అధికారం ఉందా?

  • Published By: srihari ,Published On : June 3, 2020 / 08:44 AM IST
ట్రంప్ అన్నంత పనిచేస్తారా? దేశాధ్యక్షుడికి మిలటరీని దింపే అధికారం ఉందా?

Updated On : June 3, 2020 / 8:44 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తారా? దేశంలో పెచ్చరిల్లుతోన్న ఆందోళనకారులను అదుపు చేసేందుకు మిలట్రీని రంగంలోకి దింపుతారా? దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను వెంటనే ఆపకపోతే ఆర్మీని రంగంలోకి దింపుతానని ట్రంప్ బెదిరించే ప్రయత్నం చేశారు. లూటింగ్ చేస్తే షూటింగ్ ఆర్డర్ ఇస్తానన్న ట్రంప్.. కంట్రోల్ తప్పితే ఊరుకోనంటూ నిరసనకారులను మరింత రెచ్చగొట్టేలా ప్రసంగించారు. ఒకవైపు కరోనాతో అమెరికా అల్లాడిపోతుంది. మరోవైపు విధ్వంసంతో అట్టుడికిపోతోంది. అల్లర్లను నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలం అయితే తాను మిలటరీ బలగాలను రంగంలోకి దింపుతానని ట్రంప్ చెప్పారు.

కానీ, కొన్ని రాష్ట్ర గవర్నర్లు మాత్రం ట్రంప్ ప్రభుత్వానికి ఆ అధికారం లేదని స్పష్టం చేశాయి. రాష్ట్ర అధికారుల అనుమతి లేకుండా సాయుధ దళాలను రంగంలోకి దింపే అధికారం లేదని అభిప్రాయపడ్డారు. ఇంతకీ అమెరికా అధ్యక్షుడికి మిలటరీని దింపే అధికారం ఉందా? అంటే క్లుప్తంగా అవుననే చెప్పాలి. అది కూడా పరిస్థితులు చేయిదాటిపోయిన నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఆదేశించే అధికారం ఉంటుంది. ఇప్పటికే వేలాది మంది సైనిక బలగాలు నేషనల్ గార్డ్ నుంచి మోహరించాయి.
Trump protest

అమెరికా ఆర్మీ కోసం పనిచేసే సైనిక దళం కర్ఫ్యూ ప్రాంతానికి మోహరించినట్టు అధికారిక వర్గాల సమాచారం. అమెరికా వ్యాప్తంగా 20 రాష్ట్రాలకు పైగా ప్రాంతాల్లో ఆందోళనలను నియంత్రించేందుకు సైనిక దళం ప్రయత్నిస్తోంది. కానీ, ఈ బలగాలను అక్కడి నగరాలు లేదా రాష్ట్రాలు మాత్రమే తమ అధికారాలతో అభ్యర్థించాయి. 19వ శతాబ్దం నాటి అమెరికా చట్టం ప్రకారం.. వాషింగ్టన్ డీసీలో పరిస్థితులు అదుపు తప్పిన సమయంలో మాత్రమే రాష్ట్రాల అనుమతి లేకుండా జోక్యం చేసుకునే అధికారం ఉంది. 

ఆందోళనల విషయంలో ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మిన్నెసొటాలో ఆరంభమైన అల్లర్లు రాజధాని వాషింగ్టన్ వరకూ పాకాయి. ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటాయి. ఈ అల్లర్లకు ఉక్కుపాదం మోపేలా ట్రంప్ ఆందోళనకారులను నియంత్రించడానికి సైనిక బలగాలను బరిలో దింపాలని నిర్ణయించారు. కానీ, న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీటియా జెమ్స్ మాత్రం ట్రంప్‌ తీరుపై మండిపడ్డారు.. ఆయనేం డిక్టేటర్ కాదని మిలట్రీని దింపితే తాను కోర్టుకెళ్తానంటూ హెచ్చరించారు. 
Trump protests

యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ చట్టంలోని సెక్షన్ 1807 ప్రకారం.. ట్రంప్ మిలట్రీని రంగంలోకి దింపారు. ప్రస్తుతానికి సైన్యాన్ని రాజధాని వాషింగ్టన్ డీసీకి మాత్రమే పరిమితం చేసినట్టు తెలిపారు. అల్లర్లు కొనసాగే అన్ని రాష్ట్రాల్లోనూ సైన్యాన్ని మోహరించేందుకు వెనుకాడేదిలేదని హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనకారులు కూడా వెనక్కి తగ్గడం లేదు. స్టోర్లపై పడి ఆందోళనకారులు అందినకాడికి దోచుకుపోతున్నారు. ఈ లూటీలకు ఏ సంస్థా మినహాయింపు కాదు.. ప్రముఖ టెక్ దిగ్గజాలు ఆపిల్, రీడ్ అండ్ టేలర్.. ఇలా ఏ షాప్‌నీ అల్లరిమూకలు వదలకుండా రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది. 

దేశంలో చోటు చేసుకుంటున్న ఈ హింసాకాండను అమెరికా అధ్యక్షుడు మాత్రం దేశీయ ఉగ్రవాదంగా వర్ణిస్తున్నారు. ఇలాంటి అల్లర్లకు అమెరికాలో చోటు లేదని తేల్చి చెప్పారు. అల్లర్లను అణచి వేయడానికి ఎలాంటి కఠిన చర్యలనైనా తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రసంగాలు.. చర్యలు ఆందోళనకారులను తీవ్రంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై ఆందోళనకారులను శాంతింప చేసే ప్రయత్నం చేయాలే తప్పా.. ఇలా మిలట్రీని దింపడం సరైన చర్య కాదంటూ అంచనా వేస్తున్నారు.

ఆందోళనకారుల విధ్వంసకాండకి అబ్రహం లింకన్  మెమోరియల్, వైట్‌హౌస్ సమీపంలో చారిత్రాత్మక చర్చి, రెండో ప్రపంచ యుద్ధం స్మారక కట్టడం విధ్వంసానికి గురయ్యాయి. అమెరికాలో అల్లర్లకు రాష్ట్రాల గవర్నర్లనే బాధ్యులను చేశారు ట్రంప్. గవర్నర్లు సరైన చర్య తీసుకోకపోతే మొత్తం 50 రాష్ట్రాల్లో ఆర్మీని దింపేస్తామంటూ హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికాలో 150 నగరాలు అగ్నిగుండాలుగా తయారయ్యాయి. చివరికి వైట్‌హౌస్ పరిసరాల్లోనూ టియర్ గ్యాస్ ప్రయోగించాల్సిన పరిస్థితి ఎదురైంది. 

Read: ఎక్కడ చూసినా విధ్వంసం.. అమెరికాకి ఏమైంది.. ఏ దిశగా పోతోంది!