EctoLife: రంగు, రూపం ఎంచుకొని మరీ పిల్లల్ని కనొచ్చట. అది కూడా గర్భం అవసరం లేకుండానే!
ఇది అందుబాటులోకి రావాలంటే నైతిక నిబంధనలు తొలగాలని హషీం అంటున్నారు. మానవ అండంపై పరిశోధన, కృత్రిమ గర్భధారణ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక నైతిక నిబంధనలున్నాయని, తాను ఇప్పటికే వ్యవస్థను పూర్తిగా తయారుచేసినప్పటికీ, ఆ నిబంధనలన్నీ తొలగితేనే ఎక్టోలైఫ్ను తీసుకురాగలమని చెప్పారు.

We may one day grow babies outside the womb says Hashim
EctoLife: గర్భాన్ని మోయలేని వారో లేదంటే వేరే ఇంకేదైనా కారణాలతోనో కొంత మంది తమ గర్భం నుంచి పిల్లల్ని కనడం లేదు. అందుకు అద్దె గర్భాల్ని ఉపయోగించుకుంటున్నారు. కొంత కాలం క్రితం ఇది చాలా వింతగా అనిపించినప్పటికీ, రాను రాను చాలా కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ అవసరం కూడా లేకుండా పిల్లల్ని కనే సాంకేతికత ఎదిగిందని ప్రచారం జరుగుతోంది. జర్మనీకి చెందిన హషీం అల్ ఘైలీ అనే బయోటెక్నాలజిస్టు ఈ నూతన వ్యవస్థను రూపొందించానని అంటున్నారు. ‘ఎక్టోలైఫ్’ పేరిట తాను ఒక కృత్రిమ గర్భ వ్యవస్థను సిద్ధం చేశానని, ఇందులో తల్లి గర్భంతో ఏమాత్రం పని ఉండదని, బిడ్డలు తయారయ్యేందుకు వీలుగా పాడ్స్ ఉంటాయని, శిశువుల రంగు, పొడవు, బలాన్ని తల్లిదండ్రులు ఎంచుకుని వారిని పొందవచ్చని ఆయన పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఉపయోగించే ఫలదీకరణ (సరోగసి) విధానంతో అసలు సంబంధమే లేదట. శిశువులు పూర్తిగా ఎక్టోలైఫ్ వ్యవస్థలోని ప్రత్యేక పాడ్లలోనే పిండం దశ నుంచి బిడ్డ దశ వరకూ ఎదుగుతుందట. ఇందుకోసం అచ్చం తల్లి గర్భంలో ఉన్న అమరికనే పాడ్‌లో ఏర్పాటు చేస్తారు. రెండు బయో రియాక్టర్లకు పరిశ్రమలోని పాడ్‌లన్నీ అనుసంధానమై ఉంటాయి. ఆ రియాక్టర్లలో ఒకదాని నుంచి వచ్చే ద్రవాలు, తల్లి గర్భంలో శిశువు చుట్టూ ఉండే ద్రవాల్లా పని చేస్తాయి. శిశువుల దేహాల నుంచి ఏవైనా వృథా వస్తే దాన్ని తొలగించేందుకు రెండో రియాక్టర్‌ను ఉపయోగిస్తారు. ఇందుకోసం కృత్రిమ బొడ్డు పేగును కూడా శిశువులకు అమరుస్తారు. ఈ వ్యవస్థలో శిశువు ఎటువంటి ఇన్ఫెక్షన్ల భయం లేకుండా పెరుగుతుందని హషీం వివరిస్తున్నారు.
అయితే ఇది అందుబాటులోకి రావాలంటే నైతిక నిబంధనలు తొలగాలని హషీం అంటున్నారు. మానవ అండంపై పరిశోధన, కృత్రిమ గర్భధారణ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక నైతిక నిబంధనలున్నాయని, తాను ఇప్పటికే వ్యవస్థను పూర్తిగా తయారుచేసినప్పటికీ, ఆ నిబంధనలన్నీ తొలగితేనే ఎక్టోలైఫ్ను తీసుకురాగలమని చెప్పారు.