కోడి గుడ్లు స్మగ్లింగ్.. డ్రగ్స్‌ను మించి కొనసాగుతున్న దందా.. కోడి పెట్టలను అద్దెకిస్తూ జోరుగా వ్యాపారం..
అమెరికాలో కోడి గుడ్ల కొరతను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

USA Eggs Smuggling
USA Eggs Smuggling: డ్రగ్స్ స్మిగ్లింగ్.. బంగారం స్మగ్లింగ్ ఇలా పలురకాల వస్తువులను ఒక దేశం నుంచి మరొక దేశంలోకి స్మిగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ, కోడి గుడ్లు స్మిగ్లింగ్ చేయడం ఎప్పుడైనా విన్నారా.. అదికూడా డ్రగ్స్ కంటే పది రెట్లు ఎక్కువ మొత్తంలో కోడిగుడ్ల అక్రమ రవాణా దందా కొనసాగుతోంది. అదికూడా.. అగ్రరాజ్యం అమెరికాలో. అక్కడ పౌష్టికాహారమైన కోడి గుడ్లు ఇప్పుడు ప్రజలకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. అక్కడ డజను కోడి గుడ్ల ధర దాదాపు 10 డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.870.
అమెరికన్లు కోడి గుడ్లను ఎక్కువగా వినియోగిస్తారు. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. అయితే, ఆ దేశంలో బర్డ్ ప్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. రెండుమూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కోడి గుడ్ల కొరతకు దారితీసింది. దీంతో కోడి గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లో డజన్ కోడి గుడ్ల ధర 9 నుంచి 10 డాలర్లు పలుకుతుంది. అయితే, ఈ ఏడాది చివరి నాటికి గుడ్ల ధరలు మరో 50శాతం పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే డజన్ కోడిగుడ్ల ధర భారత కరెన్సీలో రూ. 1200 నుంచి రూ. 1300కు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
అమెరికాలో కోడి గుడ్ల కొరతను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కెనడా నుంచి అమెరికాలోకి కోడి గుడ్లను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ దందా ఏ స్థాయికి చేరిందంటే.. డ్రగ్స్ కంటే 10రెట్లు అదనంగా కోడి గుడ్ల దందా కొనసాగుతుందట. కెనడా, అమెరికా దేశాలకు కొన్నేళ్లుగా నిద్రలేకుండా చేస్తున్న ఫెంటానిల్ వంటి డ్రగ్స్ కంటే కూడా కోడి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే గుడ్ల దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాల ప్రకారం.. 2024 అక్టోబర్ తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36శాతం పెరిగిందట. మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్ డీగో వద్ద కోడి గుడ్ల అక్రమ రవాణా 158శాతం పెరిగిపోయిందట.
గుడ్లు సంక్షోభం నేపథ్యంలో అమెరికాలోని కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారంకు తెరతీశారు. దీంతో కోడి పెట్టలకు డిమాండ్ పెరిగింది. పలు కంపెనీలు ఆరు నెలల ప్రాతిపదికన కోడి పెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీసం అద్దె ప్యాకేజీ 300 డాలర్ల నుంచి 310 డాలర్ల వరకు ఉంది. అయితే, ఆర్నెళ్లకు కోడి పెట్టలకు సరిపడే దాణాను సదరు కంపెనీలే చెల్లిస్తున్నాయి. అక్కడ ఆరోగ్యకరంగా ఉండే కోడి పెట్ట వారానికి ఐదారు గుడ్లు పెడుతుంది.