శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు: ముందంజలో రాజపక్సే

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు: ముందంజలో రాజపక్సే

Updated On : November 17, 2019 / 8:54 AM IST

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగియకముందే అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఓడిపోయినట్లుగా అంగీకరించారు. విజయం సాధిస్తోన్న గోటబాయ రాజపక్సేకు అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రేమదాస. దీంతో శ్రీలంక ఏడో అధ్యక్షునిగా గోటబాయ రాజపక్సే బాధ్యతలు చెపట్టబోతున్నారు.

నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి శ్రీలంకలో శనివారం(16 నవంబర్ 2019) ఎన్నికలు జరగగా.. అధ్యక్ష పీఠం కోసం మొత్తం 35 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ప్రధానంగా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, ప్రతిపక్ష అభ్యర్థి గొటబయా రాజపక్సే(శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే సోదరుడు), అధికార నేషనల్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ పార్టీ నేత సాజిత్‌ ప్రేమదాస మధ్యనే పోటీ నెలకొంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం అవగా.. ఆదివారం(17 నవంబర్ 2019) మధ్యాహ్నం వరకు ట్రెండ్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో గొటబయా రాజపక్సే ఖాయమైంది.

గోటబాయ రాజపక్సే లెప్టినెంట్ కల్నల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన ఉండగా.. అతని పదవీకాలం ముగియడంతో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ముస్లిం ఓట్లు, ఈస్టర్ సండే ప్రార్థనల రోజు జరిగిన బాంబ్ దాడి ఎక్కువగా ప్రభావం చూపినట్లు దేశంలో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 15.9 మిలియన్ల ఓటర్లు 12 వేల 845 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80శాతం ఓటింగ్ దేశంలో నమోదైంది. మొత్తం పోలైన ఓట్లలో 53శాతం నుంచి 54శాతం ఓట్లు రాజపక్సేకి వచ్చే అవకాశం ఉందని అంచనా.