కరోనా భయం…జర్మనీ ఆర్థికమంత్రి ఆత్మహత్య

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2020 / 04:30 PM IST
కరోనా భయం…జర్మనీ ఆర్థికమంత్రి ఆత్మహత్య

Updated On : March 29, 2020 / 4:30 PM IST

కరోనా వైరస్(COVID-19) కారణంగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రాట్స్ (సీడీయూ) పార్టీకి చెందిన నాయకుడు. గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన్న దాదాపు పదేళ్లుగా ఆర్థిక మంత్రిగా పని చేస్తున్నారు.

హొచీమ్ పట్టణంలో ఆయన మృతదేహాన్ని హై స్పీడ్ రైల్వే లైన్‌ పై గుర్తించారు. రైల్వే ట్రాక్‌ పై డెడ్ బాడీని గుర్తించిన పారామెడికల్ సిబ్బంది పోలీసులుకు సమాచారం అందించారు. తర్వాత మృతదేహాన్ని పరిశీలించిన భద్రతా సిబ్బంది చనిపోయింది థామస్ అని గుర్తించారు. కానీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు చాలా సేపటి వరకూ గోప్యంగా ఉంచారు.

బలవనర్మరణానికి పాల్పడే ముందు థామస్ సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన తరచుగా ప్రజల మధ్య కనిపిస్తున్నారు. కరోనా సంక్షోభం వేళ ఆర్థిక సాయం గురించి ఆయన ప్రజలకు సమాచారం అందించారు. జర్మనీ ఆర్థిక రాజధాని ఫ్రాంక్‌ ఫర్ట్ నగరం కూడా హెస్సే రాష్ట్ర పరిధిలోనే ఉంది. స్టేట్ ప్రీమియర్ వోకర్ బౌఫీయర్‌కు షఫెర్ వారసుడనే భావించారు.  2023లో ఆయన పోటీకి దూరంగా ఉంటే థామస్ ప్రీమియర్ (మన సీఎం పదవి లాంటిది) అవుతారనుకున్నారు.

కానీ ఇంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో జర్మనీ రాజకీయ నాయకులు షాకయ్యారు. కోవిడ్ మహమ్మారి కారణంగా షఫెర్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని బౌఫీయర్ తెలిపారు. ఆర్థిక సాయం పట్ల ప్రజల్లో తీవ్రమైన అంచనాలు ఉండటంతో.. వాటిని అందుకోవడం ఎలా అనే ఆందోళనతో, తీవ్ర మనస్తాపానికి గురైన థామస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రీమియర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు జర్మనీలో 58 వేల మందికిపైగా కోవిడ్ బారిన పడగా 455 మంది ప్రాణాలు కోల్పోయారు.