Israel-Gaza war : నీటి కొరతతో రోజుల తరబడిగా స్నానం చేయని గాజా వాసులు

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా నగరంలో తీవ్ర మంచినీటి కొరత ఏర్పడింది. గాజా నగరానికి నీరు, విద్యుత్, ఆహారం నిలిపివేయడంతో ప్రజలు అల్లాడుతున్నారు. గాజా నగరంలో నీటి సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు రోజుల తరబడిగా స్నానాలు చేయడం లేదు...

Israel-Gaza war : నీటి కొరతతో రోజుల తరబడిగా స్నానం చేయని గాజా వాసులు

Gaza Water Supply

Updated On : October 16, 2023 / 5:11 AM IST

Israel-Gaza war : గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా నగరంలో తీవ్ర మంచినీటి కొరత ఏర్పడింది. గాజా నగరానికి నీరు, విద్యుత్, ఆహారం నిలిపివేయడంతో ప్రజలు అల్లాడుతున్నారు. గాజా నగరంలో నీటి సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు రోజుల తరబడిగా స్నానాలు చేయడం లేదు. గాజావాసులు చాలామంది స్నానాల గదుల వద్ద బారులు తీరారు. ‘‘మేం చాలా రోజులుగా స్నానం చేయలేదు, టాయిలెట్ కు వెళ్లడానికి కూడా వరుసలో వేచి ఉండాల్సి వస్తుంది’’ అని హమీద్ అనే గాజా వాసి ఆవేదనగా చెప్పారు.

ఆకలితో అలమటిస్తున్న గాజా వాసులు

తినడానికి ఆహార పదార్థాలు దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. తినడానికి ట్యూనా డబ్బాలు, జున్ను మాత్రమే అందుబాటులో ఉన్నా వాటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయని ఓ గాజా వాసి చెప్పారు. పరిమితంగా సరఫరా అయిన నీటిని స్నానానికి ఉపయోగిస్తే తాగడానికి ఎలా అని మరో గాజా వాసి ప్రశ్నించారు. ఇజ్రాయెల్ వైమానిక బాంబుల దాడి తర్వాత 10 లక్షలమంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు 2,670 మంది మరణించారు. ఇజ్రాయెల్ సైనిక దాడులతో భయాందోళనలు చెందిన పలువురు పాలస్తీనియన్లు వలస పోతున్నారు.

విలపిస్తున్న గాజావాసులు

గాజా నగరంలోని ఉత్తర ఎన్ క్లేవ్ కు చెందిన అహ్మద్ హమీద్ తన భార్య, ఏడుగురు పిల్లలతో కలిసి రఫా నగరానికి పారిపోయారు. మోనా అబ్దుల్ హమీద్ గాజా నగరంలోని తన ఇంటిని వదిలి రాఫాలోని బంధువుల ఇంటికి వెళ్లింది. బట్టలు ఉతకడానికి నీరు లేదని, మురికిగా ఉన్న బట్టలే ధరించాల్సి వస్తుందని ఓ గాజా మహిళ ఆవేదనగా చెప్పింది. కరెంటు, నీరు, ఆహారం, ఇంటర్నెట్ లేదని, దీంతో తాము దుర్భర జీవితం గడుపుతున్నామని మరో మహిళ విలపిస్తూ చెప్పారు.

Also Read :Afghanistan Earthquake : అఫ్గానిస్థాన్ లో మరోసారి భూకంపం.. భయంతో వణికిపోయిన స్థానికులు

తాగడానికి గుక్కెడు నీరు దొరక్క తాము ఎక్కడి నుంచి మంచినీటిని తెచ్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నామని పాలస్తీనా శరణార్థి చెప్పారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలోని ఓ డాక్టర్ కుటుంబం మరణించింది. తన కుమార్తెకు కేన్సర్ ఉందని, తనకు రక్తపోటు, మధుమేహం సమస్యతో బాధపడుతున్నానని మరో గాజా వాసి వివరించారు.

Also Read :Raghunandan Rao Madhavaneni : మోచేతికి బెల్లం పెట్టినట్లుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో, హరీశ్ రావు చెప్పుల ఖరీదు లక్ష రూపాయలు- రఘునందన్ రావు