ఇమ్రాన్ కీలక నిర్ణయం…భారత్ కు పాక్ దారులు బంద్

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2019 / 02:42 AM IST
ఇమ్రాన్ కీలక నిర్ణయం…భారత్ కు పాక్ దారులు బంద్

Updated On : August 28, 2019 / 2:42 AM IST

ఇకపై భారత విమానాలు తమ గగనతలం మీదుగా వేరే దేశానికి వెళ్లకుండా చూడాలని పాక్ భావిస్తోంది. భారత విమానాలు వెళ్లకుండా  తమ గగనతల మార్గాలను పూర్తిగా మూసివేసే అంశాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిశీలిస్తున్నారని,దీనికి సంబంధించిన చట్టపరమైన విధివిధానాలను ప్రభుత్వం సమీక్షిస్తున్నదని ఆ దేశ మంత్రి ఫవాద్‌ చౌదరీ  తెలిపారు. అంతేకాకుండా పాకిస్తాన్ భూభాగం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు భారత వ్యాపారాన్ని అడ్డుకుంటున్నట్లు మంత్రి ఫవాద్ చౌదరి ట్విట్టర్‌లో తెలిపారు.

మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇటీవల ఫ్రాన్స్‌ పర్యటనకు ప్రధాని మోడీ పాకిస్థాన్‌ గగనతలం మీదుగా రాకపోకలు సాగించడం పాక్‌కు మింగుడుపడటం లేదు. ఈ క్రమంలో భారత విమానాల్ని తమ గగనతలం నుంచి అనుమతించరాదన్న ఒత్తిళ్ల కారణంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.

జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా భారత్‌తో వాణిజ్యాన్ని బంద్‌ చేసుకోవడంతోపాటు గగనతల మార్గాల్లో మూడింటిని పాక్‌ ఇప్పటికే మూసివేసింది. ఇప్పుడు మిగిలిన మార్గాలను కూడా పూర్తిగా మూసివేయాలని భావిస్తున్నది. భారత విమానాల్ని పాక్‌ గగనతలం మీదుగా ప్రయాణించకుండా పూర్తి నిషేధాన్ని విధించే ప్రతిపాదనను ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ పరిశీలించింది. అలాగే పాక్‌ భూభాగం గుండా ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లే వాణిజ్య మార్గాలను కూడా ఇకపై అనుమతించకూడదని భావిస్తున్నాం. వీటికి సంబంధించిన చట్టపరమైన విధివిధానాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఫవాద్‌ ట్వీట్‌ లో తెలిపారు. గతంలో బాలాకోట్‌పై వాయుసేన దాడుల అనంతరం కూడా పాకిస్థాన్‌ కొంతకాలం పాటు తన గగనతలాన్ని మూసివేయడం తెలిసిందే.