కంట్రోల్ లో లేని కరోనా…ఇరాన్ లో 24గంటల్లో 54మంది మృతి

ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో ఇరాన్ లో 54 కరోనా మరణాలు నమోదైనట్లు మంగళవారం(మార్చి-10,2020)ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ లో కరోనా కేసలు నమోదైనప్పటి నుంచి ఒక్క రోజులో అత్యధిక మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు తెలిపారు.
ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 291కి చేరినట్లు ఇరాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రతినిధి కియానోష్ జహన్ పౌర్ తెలిపారు. కొత్తగా 881మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయినట్లు ఆయన తెలిపారు.ఇరాన్ లో ఇప్పటివరకు 8వేల 42మంది కరోనా సోకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు ఆయన తెలిపారు.
వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది ఇరాన్,ఇటలీ దేశస్థులే అన్న విషయం తెలిసిందే. మరోవైపు కరోనాను కంట్రోల్ చేసేందుకు ఇరాన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 70వేలమందిని విడుదల చేసినట్లు సోమవారం(మార్చి-9,2020)ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహిం రైసీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4వేల 26కు పెరిగింది. లక్షా 20వేల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇరాన్‌లో కరోనా వైరస్ విజృభించడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీంతో మొదటివిడతలో 58 మంది భారతీయులు ఇరాన్ ఇరాన్ నుంచి బయలుదేరారు. తెహ్రాన్ నుంచి భారత వాయుసేన విమానంలో ఘజియాబాద్ చేరుకున్నారు.