Large Alligator : OMG.. ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.. ఒక మొసలి మరో మొసలిని చంపి తినేసింది
ఓ మొసలి మరో మొసలిని పట్టి తినేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సిల్వర్ స్ప్రింగ్స్ స్టేట్ పార్క్ లో ఇది జరిగింది.

Large Alligator Eat Another Alligator : జీవి ఏదైనా తన జాతికే చెందిన జీవులను తినడం అరుదు. ఒకవేళ రెండింటి మధ్య పోరాటం జరిగి చంపేసుకున్నా.. ఆహారం కోసం మాత్రం సొంత జాతి జీవులను తినడం చాలా తక్కువ అనే చెప్పాలి. ఇలా తమ సొంత జాతి జీవులను తినడాన్ని కేనిబాలిజం అంటారు. పాముల వంటి కొన్నిరకాల జీవుల్లో మాత్రమే ఇలాంటి కేనిబాలిజం కనిపిస్తుంటుంది. ఇదే తరహాలో ఓ మొసలి మరో మొసలిని పట్టి తినేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సిల్వర్ స్ప్రింగ్స్ స్టేట్ పార్క్ లో టామీ షా అనే వ్యక్తి ఓ వీడియో తీశాడు. నేషనల్ పార్క్ లో ఉన్న సరస్సులో ఓ పెడల్ బోట్ లో వెళుతుండగా.. ఓ పెద్ద మొసలి కదులుతుండటం కనిపించింది. దాన్ని వీడియో తీయడం మొదలుపెట్టిన టామీ షా.. అక్కడేం జరుగుతున్నది చూడగా, ఒళ్లు జలదరించింది. ఓ పెద్ద మొసలి మరో మొసలిని పట్టుకోవడం చూశాడు. ఆ మొసలిని గట్టిగా పట్టుకుని.. నీటిలోంచి పైకి ఎగరేసినట్టుగా చేస్తూ మళ్లీ కిందికి బాదడం మొదలుపెట్టింది. తన బోటుకి సమీపంలోనే ఇదంతా జరిగింది. అతడు దీన్ని వీడియో తీశాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
సాధారణంగా మొసళ్లు కలిసి ఉంటాయని.. గుంపులుగా వేటాడుతుంటాయని నిపుణులు వివరిస్తున్నారు. కానీ ఇలా ఒక మొసలి మరో మొసలిని పట్టుకుని తినడం అరుదని అంటున్నారు.