స్మార్ట్ ఫోన్లతో ఫేక్ ట్రాఫిక్ జామ్…గూగుల్ మ్యాప్స్ నే బోల్తా కొట్టించాడు

నిత్యజీవితంలో గూగుల్ మ్యాప్స్ అనేది ఓ అవసరమైనదిగా మారిపోయింది. ఎక్కిడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు లేదా వెళ్లాలనుకున్నప్పుడు చాలా మంది గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని అది చూపించిన డైరక్షన్ లో వెళితే మనం వెళ్లాలనుకున్న ప్లేస్ కు సులభంగా వెళ్లవచ్చు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఒక్కసారి తప్ప గుగూల్ కూడా ఖచ్చితమైన లొకేషన్లు చూపిస్తూ మనం వెళ్లాలనుకున్న ప్రదేశానికి చేరుస్తుంది. అయితే జర్మనీలోని ఓ వ్యక్తి 90స్మార్ట్ ఫోన్లతో ఫేక్ ట్రాఫిక్ జామ్ సృష్టించి ఏకంగా గూగుల్ మ్యాప్స్ నే ఫూల్ ని చేశాడు.
సైమన్ వెకర్ట్ అనే ఆర్టిస్ట్ ఓ వినూత్న ప్రయోగం చేశాడు. 99 స్మార్ట్ ఫోన్లలో లొకేషన్ ఆఫ్షన్స్ ను ఆన్ చేసి ఓ చిన్న బండిలో వాటిని ఉంచి దాన్ని లాక్కుంటూ బెర్లిన్ రోడ్ల మీద తిరిగాడు. గూగుల్ ఆఫీస్ ఉన్న వీధితో సహా చాలా వీధుల్లో తిరిగాడు. నెమ్మదిగా స్మార్ట్ ఫోన్లు ఉన్న బండిని లాక్కుంటూ సైమన్ వెకర్ట్ రోడ్లపై తిరుగుతుండటంతో గూగుల్ మ్యాప్స్ స్మార్ట్ ఫోన్లలోని లొకేషన్ మోడ్ ఆధారంగా ఆ ప్రాంతాల్లో ఎక్కువ వాహనాలు తిరుగుతున్నట్లు భావించి అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లు గూగుల్ మ్యాప్ లో ఎరుపురంగు మార్క్ ను చూపించింది. అయితే వాస్తవానికి ఆ రోడ్లమీద జనమే లేరు. ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ. అలా సైమన్ గూగుల్ మ్యాప్స్ నే బోల్తాకొట్టించాడు. ఇదంతా సైమన్ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు.
స్మార్ట్ ఫోన్లలో ఉండే లొకేషన్ మోడ్ సాయంతో గూగుల్ కార్లు,ఇతర వాహనాల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. దాని ఆధారంగా ఆయా ప్రదేశాల్లో ఎన్ని వాహనాలు,ఎంత వేగంతో వెళ్తున్నాయనేది గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుంది. ఎక్కువ సంఖ్యలో ఫోన్లలో లొకేషన్ మోడ్ ఆన్ లో ఉంటే ఆ ప్రదేశాన్ని ఎరుపురంగులో చూపించి..ఆ దారిలో ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలియపరుస్తుందన్న విషయం తెలిసిందే.