అమెరికాలో కరోనా మరణమృదంగం…ఒక్కరోజే దాదాపు 2 వేల మంది మృతి

అమెరికాలో కరోనా మరణాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో అగ్రరాజ్యంలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి .ఎంత ప్రయత్నించినా కరోనా మరణాలకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది. బుధవారం ఒక్కరోజే అమెరికాలో కరోనా సోకి 1973 మంది మృతి చెందారు. అంతకుముందు రోజు మంగళవారం ఏకంగా 1858మంది మరణించారు.
మరణాలు రోజురోజుకు పెరుగుతుండడం అమెరికన్లలో ఆందోళన కలిగిస్తోంది. ఈసారి కూడా అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోనే 779 మంది మరణించడం కలకలం రేపింది. న్యూయార్క్ న్యూజెర్సీ నగరాల్లోనే కరోనా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉంది. న్యూయార్క్ లో ఇప్పటివరకు 6268మంది మరణించగా.. 151,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీలో ఇప్పటిదాకా 47,437 కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు.
ప్రపంచంలో ఏ దేశంలో నమోదవనన్ని కేసులు ఒక్క న్యూయార్క్ లోనే నమోదయ్యాయి అంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమెరికా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 35వేలు దాటాయి. ఏ దేశంలోనూ ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 34వేల కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Also Read | ఒడిషాలో ఏప్రిల్ 30వరకు లాక్ డౌన్…జూన్ 17వరకు విద్యాసంస్థల మూసివేత