Donald Trump : భారత్ ఇకపై రష్యా చమురు కొనుగోలు చేయదు.. నాకు మోదీ హామీ ఇచ్చారు.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురును కొనుగోలు చేయదని...

Donald Trump : భారత్ ఇకపై రష్యా చమురు కొనుగోలు చేయదు.. నాకు మోదీ హామీ ఇచ్చారు.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Donald Trump

Updated On : October 16, 2025 / 7:58 AM IST

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురును కొనుగోలు చేయదని, ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం వల్లనే భారతదేశం ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. భారతదేశం రష్యా చమురును కొనుగోలు చేయడం వల్ల ఆ దేశానికి ఆర్థికంగా సహాయం చేస్తుందని, తద్వారా యుక్రెయిన్‌లో యుద్ధం చేయడానికి పరోక్షంగా రష్యాకు భారత్ అండగా నిలుస్తుందని ట్రంప్ ఆరోపించారు. అయితే, తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును ఆపేస్తున్నట్లు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారంటూ పేర్కొన్నారు.

Also Read: Snakes : ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న ప్రాంతంలో.. పాముల కలకలం.. అధికారుల్లో టెన్షన్ టెన్షన్..

ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడంపై తాను భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్ల పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయని అమెరికా భావిస్తోందని ట్రంప్ అన్నారు. అయితే, ప్రధాని మోదీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయబోమని నాకు హామీ ఇచ్చారు. అయితే, దీన్ని వెంటనే చేయలేరు. ఇది క్రమంగా జరిగే ప్రక్రియ. కానీ, ఆ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని ట్రంప్ అన్నారు.

భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ‘అవును, ఖచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నాకు స్నేహితుడు. మా మధ్య చాలా మంచి సంబంధం ఉంది. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను. ఈరోజు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు. ఇదొక ప్రధానమైన కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. చైనాసైతం రష్యా చమురును కొనకుండా చేస్తానని.. ఇక ఇదే మిగిలి ఉందని ట్రంప్ అన్నారు.

ఇంధన విధానంపై భారతదేశం, అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ యూఎస్‌కు భారత్ సన్నిహిత భాగస్వామి అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చమురుకు సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ధ్రువీకరించలేదు.

ట్రంప్ మరోసారి కేవలం ఎనిమిది నెలల్లోనే ఎనిమిది యుద్ధాలను ఆపానంటూ పునరుద్ఘాటించారు. ఇంతవరకు ఏ ఇతర అమెరికా అధ్యక్షుడు కూడా ఇలా చేయలేదని ట్రంప్ నొక్కి చెప్పారు. అయితే, ప్రపంచ శాంతికోసం తాను చేసిన ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. నాకు నోబెల్ బహుమతి వచ్చిందా..? లేదు అని ట్రంప్ అన్నారు. కానీ, నేను దేని గురించి ఆలోచిస్తున్నానో మీకు తెలుసా..? నేను బహుశా వందల, మిలియన్ల మంది ప్రాణాలను కాపాడాను అంటూ ట్రంప్ అన్నారు.