సూపర్ ఐడియా, అచ్చం కరోనా లాంటి నకిలీ వైరస్ సృష్టించిన శాస్త్రవేత్తలు, పవర్ ఫుల్ యాంటీబాడీలు కనుగొన్నారు

దాదాపు 8 నెలలు దాటింది. ఇప్పటికే కోటిన్నరమంది బాధితులయ్యారు. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా ఎంతమందిన బలి తీసుకుంటుందో తెలీదు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి కారణం కరోనా వైరస్. ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చిన అర్థ సంవత్సరం దాటినా, ఇంకా అంతుచిక్కని మిస్టరీలానే ఉందీ వైరస్. ఈ వైరస్ గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తూనే ఉంది. కరోనా వైరస్ ను పూర్తిగా అధ్యయనం చేస్తే కానీ సమస్యను పరిష్కరించలేని పరిస్థితి. మరీ వైరస్ ను అధ్యయనం చేయాలంటే ఎలా? దీనికి ఓ సూపర్ ఐడియా వేశారు శాస్త్రవేత్తలు. అచ్చం కరోనా లాంటి నకిలీ వైరస్ ను క్రియేట్ చేసి దానిపై పరిశోధనలు జరుపుతున్నారు. ఈ రీసెర్చ్ లో అద్భుతమైన విషయాన్ని కూడా కనుగొన్నారు.
కొవిడ్ వైరస్‌ను అర్థం చేసుకునేందుకు సులువైన మోడల్:
కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది కొంతే. పైగా ఈ వైరస్‌తో పనిచేయాలంటే చాలా ఇబ్బంది. ప్రత్యేకమైన బయో సేఫ్టీ వ్యవస్థలున్న పరిశోధన ల్యాబ్ లే శరణ్యం. అది కూడా పూర్తిస్థాయి హజ్మత్ సూట్ ను వేసుకునే పనిచేయాలి. శాస్త్రవేత్తల రక్షణ కోసం ఈ ఏర్పాట్లన్నీ అవసరమైనప్పటికీ వ్యాక్సిన్, టీకా తయారీల్లో జాప్యానికి ఇవి కూడా కొంత కారణం. ఇలా కాకుండా.. ఈ వైరస్‌ను అర్థం చేసుకునేందుకు ఓ సులువైన మోడల్ ఉంటే? అచ్చంగా ఇదే పనిచేశారు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. అచ్చం కరోనా వైరస్ మాదిరిగానే కణాల్లోకి చొరబడటమే కాక.. యాంటీబాడీలతో చర్యలు జరిపే నకిలీ వైరస్ ఒకదాన్ని వీరు అభివృద్ధి చేశారు. ఒక్క తేడా ఏమిటంటే.. ఈ కృత్రిమ వైరస్‌తో ఏ రకమైన వ్యాధి రాదు. సార్స్ కోవ్-2 వైరస్ నుంచి వేరు చేసిన ఒక జన్యువును నిరపాయకరమైన ఓ వైరస్‌లోకి జొప్పించడం ద్వారా ఈ హైబ్రిడ్ వైరస్ తయారైంది.
ఈ హైబ్రిడ్ వైరస్‌పై సాధారణ పరిశోధనశాలల్లోనూ ఎంచక్కా పరిశోధనలు చేపట్టొచ్చు:
వ్యాధి ఎలాగూ కలుగజేయదు కాబట్టి ఈ హైబ్రిడ్ వైరస్‌పై సాధారణ పరిశోధనశాలల్లోనూ ఎంచక్కా పరిశోధనలు చేపట్టవచ్చునని సీన్ వీలా న్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సులువుగా జన్యుమార్పులు చేయగలిగే.. పరిశోధనశాలల్లో ఇప్పటికే విస్తృతంగా వినియోగంలో ఉన్న వెసిక్యులర్ స్టోమటైటిస్ వైరస్.. క్లుప్తంగా వీఎస్‌వీని తాము హైబ్రిడ్ వైరస్ తయారీకి ఎంచుకున్నామని, పాడిపశువులు, గుర్రాలు, పందుల్లో ఈ వైరస్ ఎక్కువగా ఉంటుందని వీలాన్ తెలిపారు. అప్పుడప్పుడూ మనుషులకూ ఇది సోకుతుందని కానీ మూడు నుంచి ఐదు రోజుల్లోనే తొలగిపోతుందని చెప్పారు. వీఎస్‌వీ ఉపరితల ప్రొటీన్ స్థానంలో తాము కరోనా వైరస్ కొమ్మును ఏర్పాటు చేశామని ఫలితంగా ఏర్పడ్డ కొత్త వైరస్ కరోనా మాదిరిగానే వ్యవహరిస్తుందని తెలిపారు.
హైబ్రిడ్ వైరస్ ప్రమాదకారి:
కోవిడ్-19 కారక కరోనా వైరస్‌లోని ఇతర జన్యువులు లేని కారణంగా హైబ్రిడ్ వైరస్ ప్రమాదకారి మాత్రం కాదని స్పష్టం చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలు ఈ హైబ్రిడ్ వైరస్‌ను గుర్తించినట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని వీలాన్ చెప్పా రు. ఈ వైరస్‌ను అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, మెక్సికో, కెనెడాల్లోని పలు పరిశోధన సంస్థలకు సరఫరా చేశామన్నారు. యూకే, జర్మనీకి కూడా త్వరలోనే పంపనున్నట్లు చెప్పారు. నిజానికి ఈ వీఎస్‌వీ హైబ్రిడ్ వైరస్‌నే కోవిడ్ నిరోధానికి టీకాగా వాడవచ్చునని, ఈ దిశగా కూడా తాము పరిశోధన చేస్తున్నామంటున్నారు.
ఆ యాంటీబాడీలు సూపర్ పవర్‌ఫుల్:
కరోనా వైరస్‌ను మట్టుబెట్టేందుకు ప్రస్తుతానికైతే ఎలాంటి చికిత్స, టీకా అందుబాటులో లేదు. ఇతర వ్యాధుల కోసం తయారుచేసిన మందులను కరోనా రోగులపై ప్రయోగిస్తూ తాత్కాలిక ఉపశమనం మాత్రం పొందుతున్నాం. వీటితోపాటు వ్యాధిబారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి యాంటీబాడీలను వేరుచేసి వాడటమూ జరుగుతోంది. అయితే ఈ ప్లాస్మా చికిత్స కొందరికే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనం ఆసక్తి రేకెత్తిస్తోంది. వైరస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతో శరీర రోగనిరోధక వ్యవస్థ తయారుచేసే యాంటీబాడీల్లో కొన్ని ఇతరాల కంటే శక్తిమంతంగా ఉన్నట్లు వీరు గుర్తించారు. ప్లాస్మా చికిత్స అందుకున్న వారిలో సుమారు 300కుపైగా వేర్వేరు యాంటీబాడీలున్నట్లు పలు అధ్యయనాల ద్వారా ఇప్పటికే తెలియగా.. స్క్రిప్స్ శాస్త్రవేత్తలు వీటన్నింటినీ నిశితంగా పరిశీలించారు. రోగ నిరోధక వ్యవస్థకు చెందిన బీ-కణాలు తయారుచేసే యాంటీబాడీలు సాధారణంగా వై ఆకారంలో ఉంటాయి. ప్రొటీన్లతో తయారవుతాయి. మన వ్యవస్థలోని ఒక్కో బీ-సెల్ ఒక్కో రకమైన యాంటీబాడీని తయారుచేస్తుంది.
ఈ యాంటీబాడీలు కరోనా వైరస్ ను మట్టుబెట్టగలవు:
ఆసక్తికరంగా.. ఐజీహెచ్‌వీ3-53 అనే జన్యువు ఉత్పత్తిచేసే యాంటీబాడీలు మిగిలిన వాటికంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నట్లు తెలిసింది. ఇవి కరోనా వైరస్‌ను అత్యంత సమర్థంగా మట్టుబెట్టగలవని తేలింది. ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ పద్ధతి ద్వారా ఈ శక్తిమంతమైన యాంటీబాడీలు రెండింటి ఛాయాచిత్రాలను పరిశీలించినప్పుడు వాటి నిర్మాణం కూడా స్పష్టమైందని, ఈ అంశం ఆధారంగా సమర్థమైన వ్యాక్సిన్లు తయారుచేసే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా.. సార్స్ కోవిడ్-2 వైరస్‌కు ఈ యాంటీబాడీలు అతుక్కుపోయిన విధానం, ప్రాంతాల ఆధారంగా కోవిడ్-19 చికిత్సకు కొత్త మందులు కూడా తయారు చేయవచ్చునని అంచనా. ఐజీహెచ్‌వీ3-53 జన్యువు కారణంగా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఆరోగ్యంగా ఉన్న సాధారణ ప్రజల్లోనూ కొద్ది మోతాదుల్లో ఉంటాయని ఇప్పటికే జరిగిన పరిశోధనలు చెబుతుండగా.. వీటి సంఖ్యను పెంచేలా ఒక వ్యాక్సిన్‌ను తయారుచేస్తే కరోనా వైరస్ నుంచి దీర్ఘకాలం రక్షణ పొం దవచ్చునని స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్త, ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఐయాన్ విల్సన్ చెబుతున్నారు. కరోనా రోగుల్లోనూ ఈ యాంటీబాడీలను గుర్తించామని, కాకపోతే అసలువాటి కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉన్నాయని విల్సన్ వివరించారు. మనిషి వేల ఏళ్లుగా కరోనా వైరస్‌ల బారినపడతున్నాడని, రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీల రూపంలో ఎప్పుడో వీటికి విరుగుడును కూడా సిద్ధంగా ఉంచిందని, సరైన వాటిని గుర్తించి వాడటమే ప్రస్తుతం చేయాల్సిన పనని విల్సన్ అంటున్నారు.