Saudi Arabia: 356 మందికి మరణశిక్ష.. సౌదీ అరేబియాలో రికార్డ్ స్థాయికి మరణ దండనలు Executions

ఇక అంతకు ముందు ఏడాది కూడా రికార్డ్ స్థాయిలో మరణ శిక్షలు అమలు చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం.

Saudi Arabia: 356 మందికి మరణశిక్ష.. సౌదీ అరేబియాలో రికార్డ్ స్థాయికి మరణ దండనలు Executions

Updated On : January 1, 2026 / 10:29 PM IST
  • ఏడాది కాలంలో 356 మరణశిక్షలు
  • 2024లో 338 మందికి ఉరిశిక్ష
  • మొత్తం మరణ శిక్షల్లో 243 డ్రగ్స్ కేసులే
  • సౌదీ అరేబియాపై తీవ్ర విమర్శలు

 

Saudi Arabia: తీవ్రమైన నేరాలు చేసిన వారికే మరణ శిక్షలు అమలు చేస్తారు. క్షమించరాని నేరానికి పాల్పడిన వారికే మరణ దండన విధిస్తారు. ఇది సర్వ సాధారణం. కానీ ఆ దేశంలో అలా కాదు.. తప్పు చేస్తే ప్రాణం తీస్తారు. అక్కడ ఉరిశిక్షలు చాలా కామన్. ఆ దేశంలో ఒక్క ఏడాది కాలంలో ఎన్ని మరణశిక్షలు విధించారో తెలిస్తే విస్మయం కలగక మానదు. 100 కాదు 200 కాదు.. ఏకంగా 365 మందికి మరణశిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం.

సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు రికార్డ్ స్థాయికి చేరింది. ఒక్క ఏడాదిలో (2025) ఏకంగా 356 మందికి మరణ దండన అమలు చేసింది సౌదీ ప్రభుత్వం. డ్రగ్స్ రవాణపై సౌదీ సర్కార్ యుద్ధం ప్రకటించింది. ఈ కారణంగానే మరణ దండనల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం మరణ శిక్షల్లో 243 డ్రగ్స్ కేసులే కావడం గమనార్హం. మరణ దండనల అమలుకు సౌదీ ప్రభుత్వం చెప్పే కారణాల సంగతి అటుంచితే.. ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సౌదీ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు.

2022 నుంచి మళ్లీ ఉరిశిక్షలు అమలు..

ఇక అంతకు ముందు ఏడాది కూడా రికార్డ్ స్థాయిలో మరణ శిక్షలు అమలు చేసింది సౌదీ ప్రభుత్వం. 2024లో 338 మందికి మరణ దండన విధించింది. సుమారు మూడేళ్ల పాటు మాదకద్రవ్యాల కేసుల్లో మరణశిక్ష అమలును నిలిపివేసిన సౌదీ అరేబియా.. 2022 చివరిలో మాదకద్రవ్యాల నేరాలకు మళ్లీ ఉరిశిక్షలను పునఃప్రారంభించింది.

మాదకద్రవ్యాలపై యుద్ధం ప్రారంభించినప్పటి నుండి అక్కడి ప్రభుత్వం హైవేలు, సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలను పెంచింది. అక్కడ లక్షలాది మాత్రలను స్వాధీనం చేసుకుంది. డజన్ల కొద్దీ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మరణశిక్ష అమలుతో గల్ఫ్ రాజ్యం నిరంతర విమర్శలను ఎదుర్కొంటోంది. దీనిని హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

Saudi Arabia

Saudi Arabia Representative Image (Image Credit To Original Source)

సౌదీ అరేబియాపై తీవ్ర విమర్శలు..

సౌదీ అరేబియా తన చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను డైవర్సిఫై చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటక మౌలిక సదుపాయాలు, 2034 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ వంటి అగ్రశ్రేణి క్రీడా కార్యక్రమాలపై భారీగా ఖర్చు చేస్తోంది. అయితే, రాజ్యంలో శాంతిభద్రతలను కాపాడటానికి మరణశిక్ష అవసరమని అక్కడి పాలకులు చెబుతున్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 1990లో సౌదీ అరేబియాలో జరిగిన మరణశిక్షలను నమోదు చేయడం ప్రారంభించింది. అంతకు ముందు నాటి గణాంకాలపై స్పష్టత లేదు.

Also Read: జనాభాను పెంచుకునేందుకు చైనా ప్లాన్‌.. కొత్తగా ఏమేం అమలవుతున్నాయంటే?