కొలంబోలో పేలుళ్లు : క్షతగాత్రులకు రక్తం కొరత

శ్రీలంక..కొలంబోలో భయానక వాతావరణం ఏర్పడింది. వరుస బాంబు పేలుళ్లలో దద్దరిల్లుతోంది. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను టార్గెట్ చేశారు. వరుస బాంబులతో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. మొత్తం ఏడు పేలుళ్లు జరిగాయి. 185 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తమ వారు ఎక్కడ ఉన్నారని వెతుకుతున్నారు.
ఇదిలా ఉంటే గాయపడిన వారిని తరలించిన ఆసుపత్రుల్లో రక్తం అవసరం ఏర్పడుతోంది. బట్టికలోవ టీచింగ్, నెగోంబోలోని ఆస్పత్రుల్లో రక్తం కొరత ఏర్పడింది. O+, O- (ఓ పాజిటివ్, ఓ నెగటివ్) రక్తం కావాల్సి ఉంది. నెగోంబోలోని జరిగిన పేలుళ్లలో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇక్కడ దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. రక్తం అత్యవసరంగా అందించాల్సిన పరిస్థితి ఉందని..దాతలు ముందుకు రావాలని ఆస్పత్రి యాజమాన్యాలు కోరుతున్నాయి.