US Elections Results : వెల్లడవుతోన్న అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ ఖాతాలో మూడు రాష్ట్రాలు
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు రాష్ట్రాల్లో ట్రంప్ ఖాతాలో చేరగా.. ఒక రాష్ట్రంలో కమలా హారిస్ పైచేయి సాధించింది.

US Presidential Election 2024
US Elections Results : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అమెరికాకు 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోట్ల మంది పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. బుధవారం ఉదయం 9గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఓటింగ్ సరళిని బట్టి రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Kamala Harris: యూఎస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. బయటకు వచ్చి ఓటు వేయండి : అమెరికన్లకు హారిస్ పిలుపు
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు రాష్ట్రాల్లో ట్రంప్ ఖాతాలో చేరగా.. ఒక రాష్ట్రంలో కమలా హారిస్ పైచేయి సాధించింది. ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాలను రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ కైవసం చేసుకున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 23 ఎలక్టోరల్ సీట్లు ట్రంప్ ఖాతాలో చేరాయి. వెర్మాంట్ లో డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ పైచేయి సాధించారు. ఇక్కడ మూడు ఎలక్టోరల్ సీట్లు కమలా సొంతం చేసుకుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక. అంటే.. ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. అమెరికా ఓటర్లు.. ప్రస్తుత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లేదా ఇతర అభ్యర్థులకే ఓటు వేసినా.. అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం లేదు. అధ్యక్షుడిని నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులను మాత్రమే ప్రజలు ఎన్నుకుంటున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లుంటాయి. ఈ 538 మందిలో 270 వచ్చినా వారు అధ్యక్షులవుతారు.