Vladimir Putin: జీ-20 సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదట
ఈ నేపథ్యంలో తాజా బ్రిక్స్ సమావేశానికి కూడా పుతిన్ హాజరు కాలేదు. బుధవారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ నేతల సమావేశంలో వ్యక్తిగతంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు

G20 Summit: భారత్‌లో జరిగే జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం లేదట. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పుతిన్ దృష్టి ప్రత్యేక సైనిక చర్యపై ఉందని తెలుస్తోంది. ఆయనకు వ్యక్తిగతంగా హాజరయ్యే ఆలోచన లేదని క్రెమ్లిన్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ సమాచారాన్ని పంచుకుంది. వచ్చే నెల అంటే సెప్టెంబర్‌లో జీ-20 సమ్మిట్ ఇండియాలో జరగనుంది.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది
ఉక్రెయిన్‌లో పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంటే వ్లాదిమిర్ పుతిన్ విదేశాల్లో పర్యటిస్తూ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన దేశం దాటేందుకు జంకుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, క్రెమ్లిన్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది.
ఈ నేపథ్యంలో తాజా బ్రిక్స్ సమావేశానికి కూడా పుతిన్ హాజరు కాలేదు. బుధవారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ నేతల సమావేశంలో వ్యక్తిగతంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలపై పాశ్చాత్య దేశాలు యుద్ధం చేస్తున్నాయని ఆరోపించారు, ఆ యుద్ధాన్ని ముగించడమే రష్యా ప్రత్యేక సైనిక ఆపరేషన్ లక్ష్యంగా ఉందని అంటున్నారు.
అనేక పాశ్చాత్య దేశాలు ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే కోరిక కారణంగా ఉక్రెయిన్‌లో తీవ్రమైన సంక్షోభం తలెత్తిందని ఇంతకు ముందు పుతిన్ అన్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలు, భాష, భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇవ్వాలని రష్యా నిర్ణయించిందని ఆయన చెప్పారు.