అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న ‘ఈగ’.. శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని తింటూ.. రంగంలోకి హెలికాప్టర్లు.. మగ ఈగలతో అడ్డుకట్ట..
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్‌ను సైన్స్ పరిభాషలో ఇలాంటి ఈగలను కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్నజీవులు. వేరే జీవుల శరీరాలపై జీవిస్తాయి.

New World screwworm
New World screwworm: ప్రపంచ దేశాలను భయపెడుతున్న అగ్రరాజ్యం అమెరికాను ఓ ఈగ భయపెడుతోంది. ఈగ కారణంగా అమెరికా ప్రజలకు కొద్దిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా పోతోంది. దీంతో ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను సిద్ధం చేస్తోంది. అయితే, ఈ ఈగ గొడవేంటి..? అమెరికా ప్రజలు ఎందుకు భయపడుతున్నారు..? అది ఎవరిపై దాడి చేస్తోంది.. ఎలాంటి నష్టం సంభవిస్తుంది.. దీనిని ఎలా నియంత్రిస్తారు.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్‌ను సైన్స్ పరిభాషలో ఇలాంటి ఈగలను కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్నజీవులు. వేరే జీవుల శరీరాలపై జీవిస్తాయి. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై నివాసం ఏర్పర్చుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని తింటూ పెరుగుతాయి. తద్వారా ఆ జంతువులకు ప్రమాదం సంభవిస్తుంది. చికిత్స అందించకుంటే చనిపోతాయి.
అమెరికాతోపాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగల సమస్య అక్కడి ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. గత ఏడాది దక్షిణ మెక్సికోకు ఈ ఈగలు చేరుకున్నాయి. అటు నుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా – మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలిచ్చే ఆవులు మరణిస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2023 నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హోండూరస్, గ్యాటెమాలా, ఎల్ సాల్వెడార్ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. 2023 నుంచి ఇప్పటి వరకు 35వేల న్యూవరల్డ్ స్ర్కూవార్మ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి మరెన్నో ఉన్నాయి.
ఈ ఈగల వల్ల ఎక్కువ జంతువులకు ప్రమాదం. పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో ఇది గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. రెక్కలొచ్చిన తరువాత ఎగిరిపోతాయి. ఇంట్లో పెంచుకునే శునకాలు, పిల్లలకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉంటుంది. అయితే, అది చాలా స్వల్పమేనని వైద్యులు చెబుతున్నారు.
స్ర్కూవార్మ్ ఈగలను నియంత్రించేందుకు అగ్రరాజ్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా ఈగల సంతానోత్పత్తి తగ్గిపోతుంది.
పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి.