Taliban : తాలిబన్లపై యూట్యూబ్, వాట్సాప్ కీలక నిర్ణయం
యూట్యూబ్, వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాలిబన్లకు చెందిన వీడియోలను యూట్యూబ్‌లో కన్పించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

Youtube
YouTube and WhatsApp : తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకోవడంతో సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సంస్థలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే తాలిబన్లపై ఫేస్‌బుక్ నిషేధం విధించింది. తాజాగా యూట్యూబ్, వాట్సాప్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాలిబన్లకు చెందిన వీడియోలను యూట్యూబ్‌లో కన్పించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తాలిబన్లకు చెందిన వీడియోలను స్ట్రీమ్ చేయకుండా చేసే పాలసీ ఎప్పటి నుంచో యూట్యూబ్ ఫాలో అవుతుందని వెల్లడించింది.
అదే బాటలో వాట్సాప్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. తాలిబన్లు కాబూల్‌ను నియంత్రణలోకి తీసుకోగానే ఆఫ్ఘాన్లు తాలిబన్లను కాంటాక్ట్ అయ్యే ఫిర్యాదుల హెల్ప్‌లైన్‌ను మూసివేసింది. ఈ చర్యపై వ్యాఖ్యానించడానికి వాట్సాప్ ప్రతినిధి నిరాకరించారు. కాగా యూఎస్ చట్టాల ప్రకారం తాలిబన్ల హెల్ప్‌లైన్‌ను నిలిపివేసింది.
హింస, దోపిడీ లేదా ఇతర సమస్యలను నివేదించడానికి ఆఫ్ఘాన్ పౌరుల కోసం అత్యవసర హాట్‌లైన్ ఫిర్యాదుల సంఖ్యను మంగళవారం ఫేస్‌బుక్ ఇతర అధికారిక తాలిబాన్ ఛానెల్స్ తో పాటు బ్లాక్ చేసినట్లు నివేదిక తెలిపింది. ఫేస్‌బుక్ సోమవారం తాలిబన్లను తీవ్రవాద గ్రూపుగా ప్రకటించడం గమనార్హం. అంతేకాకుండా తాలిబన్లకు చెందిన కంటెంట్‌ను పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించింది. కాగా ఫేస్‌బుక్ సెన్సాన్ షిప్‌పై తాలిబన్ ప్రతినిధి అరోపణలు చేశారు.
ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆఫ్ఘాన్ పౌరులు ఆందోళనలకు దిగారు. జలాలాబాద్ నగర వాసులు పెద్ద సంఖ్యలో ఆఫ్ఘాన్ జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని ర్యాలీగా వెళ్లారు.
ప్రభుత్వ కార్యాలయాలపై ఆఫ్ఘాన్ జాతీయ జెండా ఉంచాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంపై ఉన్న తాలిబన్ జెండాను తొలగించి దాని స్థానంలో ఆప్ఘానిస్తాన్ జాతీయ జెండాను ఉంచారు. అయితే ఇది జరిగిన నిమిషాల వ్యవధిలో ఆప్ఘానిస్తాన్ జాతీయ జెండాతో నిరసనకు దిగిన పౌరులపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.