Russia-Ukraine War : జెలెన్ స్కీకి చెప్పు.. ఎలాగైనా దెబ్బకొట్టగలం.. పుతిన్ కౌంటర్..!
Russia-Ukraine War : నెలరోజులుగా రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర దాడి కొనసాగుతోంది. రష్యా దాడులను జెలెన్ స్కీ సైన్యం దీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ శాంతి చర్చలకు ఎక్కువగా మొగ్గుచూపుతోంది

Russia Ukraine War
Russia-Ukraine War : నెలరోజులుగా రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర దాడి కొనసాగుతోంది. రష్యా దాడులను జెలెన్ స్కీ సైన్యం దీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ శాంతి చర్చలకు ఎక్కువగా మొగ్గుచూపుతోంది. కానీ, పుతిన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తన బలగాలను మరింత మెహరిస్తున్నాడు. శాంతి చర్చలపై కన్నా యుక్రెయిన్ స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది రష్యా… నెల రోజులు గడుస్తున్నా యుక్రెయిన్ ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఇక లాభం లేదు అనుకున్న రష్యా.. యుక్రెయిన్ పై ఫాస్ఫరస్ వంటి భయంకరమైన మారణాయుధాలను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో రష్యాతో శాంతి చర్చలకు జెలెన్ స్కీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యుద్ధాన్ని ఎలాగైనా ఆపేందుకు పుతిన్ కు లేఖల మీద లేఖలు రాసేస్తున్నాడు. ఈ క్రమంలోనే జెలెన్ స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు శాంతి చర్చలకు పిలుపునిస్తూ లేఖను రాశాడు. రష్యా ఎక్కడ మరింత ప్రమాదకర ఆయుధాలను ప్రయోగిస్తుందోనన్న భయంతో జెలెన్ స్కీ శాంతిచర్చలకు ముందుకొచ్చాడు.
ఈ మేరకు జెలెన్ స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి తన స్వహస్తాలతో ఒక లేఖ పంపాడు. అయితే ఆ లేఖను రష్యా ఒలిగార్చ్, అనధికారిక శాంతి నిర్మాత రోమన్ అబ్రమోవిచ్.. జెలెన్ స్కీ రాసిన ఆ లేఖను పుతిన్‌కి అందజేశారు. పుతిన్ ఆ లేఖను చూసి.. మేము వారిని ఎలాగైనా దెబ్బకొట్టగలమని అతనికి చెప్పు అన్నారు. ఫిబ్రవరి 24న ఈ యుద్ధం ప్రారంభమైంది.
అప్పటినుంచి యుద్ధాన్ని ముగింపు పలికేందుకు జెలెన్ స్కీ చేయని ప్రయత్నం లేదు. తన అభ్యర్థనను ఇప్పటికే రష్యన్ ఒలిగార్చ్ రోమన్ అబ్రమోవిచ్ అంగీకరించారు. ఇందులో భాగంగానే.. రోమన్ అబ్రమోవిచ్, యుక్రెనియన్ శాంతి సంధానకర్తలతో శాంతిచర్చల్లో పాల్గొన్నారు. యుక్రెయిన్ రాజధాని కైవ్‌లో సమావేశమైన సమయంలో వారిపై విషప్రయోగం జరిగిందంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో వెల్లడించింది.

Russia Ukraine Wars
Russia-Ukraine War : అబ్రమోవిచ్‌పై విషప్రయోగం..
అబ్రమోవిచ్ శాంతి చర్చల్లో పాల్గొన్న సమయంలో అతడిపై విషప్రయోగం జరగడంతో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అబ్రమోవిచ్ సహా ఇతర యక్రెయిన్ సంధానకర్తల ఆరోగ్యం బాగానే ఉందని, వారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. రష్యా, యుక్రెయిన్‌ల మధ్య తొలి ముఖాముఖి చర్చలు మంగళవారం టర్కీలో జరగనున్నాయని యుక్రెనియన్ అధికారులు ప్రకటించారు. యుక్రెయిన్ ప్రధాన లక్ష్యం కాల్పుల విరమణగా చెబుతోంది. రష్యా ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 3.5 మిలియన్ల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు. వేలల్లో పౌరులు, చిన్నారులు, సైనికులు చనిపోయారని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు. యుద్ధం ప్రారంభం నుంచి మరియుపోల్ నగరంలో కనీసం 5వేల మంది వరకు మరణించినట్టు సీనియర్ యుక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు.
Read Also : Russia-Ukraine War : యుక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో వారిపై విష ప్రయోగం… నిజమేనంటున్న నివేదికలు..!