విశాఖ గ్యాస్ లీక్..భయపడొద్దు : బాధిత గ్రామంలో ఏపీ మంత్రుల నిద్ర

మేమున్నాం..భయపడొద్దు..ఇక్కడే తింటాం..ఇక్కడే పడుకుంటాం..ఎవరికి ఎలాంటి భయం అవసరం లేదు. విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలకు మంత్రులు భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వడమే కాదు..బాధిత గ్రామాల్లోనే మంత్రులు బస చేయడం గమనార్హం. మంత్రులు బోత్స సత్యానారాయణ, ఆవంతి శ్రీనివాస్, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, ఎంపీ విజసాయి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు బస చేసిన వారిలో ఉన్నారు.
బస చేయడానికి ముందు…బాధిత గ్రామంలో తిరిగారు. ఇంటింటికి వెళ్లి ధైర్యం చెప్పారు. ఎలాంటి భయం అవసరం లేదని వారితో చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి చెప్పారు. విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో కొలుకుని వచ్చిన వారికి ప్రభుత్వమే భోజనం ఏర్పాటు చేసింది. నాన్ వెజ్, వెజ్ వంటకాలు ఏర్పాటు చేశారు. వీరితో పాటు…మంత్రులు కూడా భోజనం చేశారు.
కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ ఏపీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్యాస్ లీక్ తో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన దాదాపు 300 మంది దాక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పరిశ్రమకు సమీపంలో ఉన్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ జీ పాలిమర్స్ స్పందించింది. విషాదానికి కారణమైన దుర్ఘటనపై క్షమాపణలు చెప్పింది.
ఈ క్రమంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు బాధిత గ్రామాల్లో పర్యటించాలని, అక్కడే బస చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొంతమంది మంత్రులు, ఎంపీ విజయసాయి రెడ్డి పర్యటించి..వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఇంటింటికి సర్వే నిర్వహించి..ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు అందచేయనుంది. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ఏపీ ప్రభుత్వం ధైర్యం చెబుతోంది.
Read More:
* విశాఖ ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామస్తుల ఆందోళన
* విశాఖ స్టైరిన్ గ్యాస్ బాధిత కుటుంబాలకు రూ.కోటి చెక్కులు అందజేసిన మంత్రులు