Nithin Upcoming Movie: ఈ ఏడాది మూడో సినిమా తెచ్చే ఒకే ఒక్క హీరో నితిన్!

ఒకప్పుడు హీరోలు ఏడాదికి మూడు, నాలుగేసి సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక్కో స్టార్ హీరో ఏడాదికి ఒక్కో సినిమా విడుదల చేయడమే కష్టమైంది. కారణాలేమైనా ఒక్కో హీరోకు ఒక సినిమా చేయాలంటే రెండేళ్లు కూడా పడుతుంది.

Nithin Upcoming Movie: ఈ ఏడాది మూడో సినిమా తెచ్చే ఒకే ఒక్క హీరో నితిన్!

Nithin Upcoming Movie Nithin Is The Only Hero To Make His Third Film This Year

Updated On : April 29, 2021 / 1:28 PM IST

Nithin Upcoming Movie: ఒకప్పుడు హీరోలు ఏడాదికి మూడు, నాలుగేసి సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక్కో స్టార్ హీరో ఏడాదికి ఒక్కో సినిమా విడుదల చేయడమే కష్టమైంది. కారణాలేమైనా ఒక్కో హీరోకు ఒక సినిమా చేయాలంటే రెండేళ్లు కూడా పడుతుంది. కామెడీ హీరోగా పేరున్న అల్లరి నరేష్ ఆ మధ్య ఏడాదికి ఆరు సినిమాలు రిలీజ్ చేసి ఔరా అనిపించగా ఇప్పుడు ఆయన కూడా వెనకబడిపోయాడు. ఇక ఇప్పుడు దాదాపుగా అందరూ ఏడాదిలో ఒకటి.. బాగా కలిసిసొస్తే రెండో సినిమా విడుదల అవుతున్నాయి.

ఇక ఇప్పుడు అసలే కరోనా కాలం. సినిమా షూటింగ్ చేయడమే కానాకష్టంగా మారగా ఒకవేళ షూటింగ్ పూర్తిచేసినా థియేటర్స్ కు రావడం ఇంకా గగనమైంది. కరోనా కాస్త రిలీఫ్ ఇచ్చిన ఈ నాలుగు నెలల్లో ఈ ఏడాది అరడజను సినిమాలు రాగా ఇప్పుడు మళ్ళీ రాబోయే అన్ని సినిమాలు వాయిదా వేసుకున్నాయి. కాగా.. సక్సెస్ సంగతి పక్కనబెడితే ఈ ఏడాది ఇప్పటికే యంగ్ హీరో నితిన్ రెండు సినిమాలు విడుదల కాగా మూడవ సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. అన్నీ సక్రమంగా కుదిరి ఉంటే వచ్చే నెలలో మూడవ సినిమా కూడా రిలీజ్ అయ్యేది.

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాగా.. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ దక్కించుకోలేదు. సరిగ్గా నెల రోజులకి మార్చి 26న రంగ్ దే సినిమా రిలీజ్ చేశారు. ఇదే టైంలో జాతి రత్నాలు స్వింగ్ లో ఉండగా.. తర్వాత రెండు వారాలకే వకీల్ సాబ్ దిగిపోవడంతో ఈ సినిమా కూడా వెనకబడింది. కాగా.. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా నితిన్ మూడవ సినిమాను కూడా సిద్ధం చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ హిట్ మూవీ అంధాధున్ ను నితిన్ రీమేక్ చేస్తున్నాడు.

మాస్ట్రో టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కేవలం పది శాతం మాత్రమే మిగిలిఉందట. కరోనా సెకండ్ వేవ్ రాకుంటే ఈ బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసి మే, జూన్ లో సినిమా రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా విరుచుకుపడడంతో ప్రస్తుతానికి వాయిదా పడింది. కానీ.. ఈ ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే ఈ కరోనా కాలంలో కూడా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఒకే ఒక్క హీరో నితిన్ కానున్నాడు.